Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు ‘వైయస్సార్‌ కాపు నేస్తం’.. కాపు మహిళలకు ఏటా రూ.15వేలు

Advertiesment
YSR Kapu Nestam
, మంగళవారం, 23 జూన్ 2020 (08:43 IST)
పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళల కోసం మరో వినూత్న పథకం ‘వైయస్సార్‌ కాపు నేస్తం’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు.

తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా, వారందరికి సుమారు రూ.354 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈనెల 24న సీఎం వైయస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

కరోనా కాలంలోనూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కు తగ్గడం లేదు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
 
వైయస్సార్‌ కాపు నేస్తం:
అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరికంలో ఉన్న కాపు మహిళలకు అండగా నిలుస్తూ వారికి ఏటా రూ.15 వేల చొప్పున, అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల రూపాయలను ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకంలో అందించనుంది. 

2019–20కి సంబంధించి ఈనెల 24వ తేదీ (బుధవారం నాడు)న పథకాన్ని అమలు చేయనున్నారు. ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్, క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభిస్తారు.
 
ఎవరెవరికి ఈ పథకం?:
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకం వర్తిస్తుంది.
 
పథకం–అర్హతలు:
– కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు.
– ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
– అదే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు.
– ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు.
– ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు.
– ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు.
 
పారదర్శకంగా ఎంపిక:
పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. సామాజిక తనిఖీ, ఆ తర్వాత గ్రామ, వార్డు వలంటీర్ల వ్యక్తిగత తనిఖీలు, గ్రామ సచివాలయాల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ.. మళ్లీ సర్వే, తనిఖీల నిర్వహణ. ఈ ప్రక్రియల ద్వారా ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకం లబ్ధిదారులను ఎంపిక చేశారు.
 
మొత్తం ఎందరు?:
2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా, వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
 
ఏయే జిల్లాలో ఎంత మంది?
ఈ ఏడాది ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది లబ్ధిదారులు ఉండగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3726 మంది మాత్రమే ఉన్నారు.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 46,856, కృష్ణా జిల్లాలో 28,363, గుంటూరు జిల్లాలో 22,538, విశాఖ జిల్లాలో 14,917, చిత్తూరు జిల్లాలో 8400, ప్రకాశం జిల్లాలో 7885, వైయస్సార్‌ కడప జిల్లాలో 7395, అనంతపురం జిల్లాలో 7085, శ్రీకాకుళం జిల్లాలో 4239, నెల్లూరు జిల్లాలో 4183, కర్నూలు జిల్లాలో 3925 మంది లబ్ధిదారులు ఉన్నారు.

ఈనెల 24వ తేదీ (బుధవారం)న సీఎం వైయస్‌ జగన్,  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా వారందరి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున మొత్తం రూ.353.81 కోట్లు జమ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన నైజీరియా