Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ పెద్దల పిలుపు మేరకు హస్తినకు చంద్రబాబు - నేడు అమిత్ షాతో భేటీ!!

chandrababu naidu

ఠాగూర్

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (08:21 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళుతున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల పిలుపు మేరకు ఆయన హస్తినకు వెళుతున్నారు. బుధవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవడమే కాకుండా, రాత్రి కూడా ఢిల్లీలోనే బస చేస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి చంద్రబాబుకు మంగళవారం ఉదయం ఫోన్ వచ్చింది. కూర్చుని మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు. 
 
ఆయన ఫోన్‌ చేసిన సమయంలో చంద్రబాబు ఏపీలోని ఉండవల్లిలో తన నివాసంలో ఉన్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు బుధవారం ఆయన ఢిల్లీ బయల్దేరుతారు. ఆయన పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన షెడ్యూల్‌ కూడా విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాత్రి అమిత్‌ షాను కలుస్తారు. వారి చర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారని సమాచారం.
 
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి చూపుతుంది. ముఖ్యంగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టుకు ముందు... నాలుగు నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆయన అరెస్టయి రిమాండ్‌లో ఉన్న సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రెండు పర్యాయాలు అమిత్‌షాతో చర్చలు జరిపారు. జగన్‌ సర్కారు పెడుతున్న తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యల గురించి వివరించారు. 
 
ఇక... బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమ పరిశీలనను సమగ్రంగా వివరించారు. ఆయన వాదనతో బీజేపీ పెద్దలు కూడా ఏకీభవించారని, పొత్తుపై వెనక్కి తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంత కాలం టీడీపీపట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురందేశ్వరి ఆ పదవి చేపట్టాక పరిస్థితి మారింది. ఇదే నేపథ్యంలో, ఇప్పుడు హఠాత్తుగా మరోమారు చంద్రబాబుకు అమిత్‌షా నుంచి పిలుపు అందడం ఆసక్తికరంగా మారింది. 
 
మరోవైపు, తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం మంగళవారం సాయంత్రం వరకూ అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధ్రువీకరించడం మినహా ఆ పార్టీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదు. పూర్తి సంయమనం పాటిస్తున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో చెప్పలేమని, పొత్తు విషయాన్ని అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్లోకి 2 డబ్ల్యు కెపాసిటీ కలిగిన 18,000 ఈవీలు: సీజర్ టెక్నాలజీస్‌తో హలా మొబిలిటి భాగస్వామ్యం