తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ అన్నారు. అందుకే, రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక టన్ను ధైర్యం తెచ్చుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా, కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలన్నారు. కేసులతో బీజేపీ భయపెడితే న్యాయపోరాటం చేయాలని కానీ భయపడటమేంటని ప్రశ్నించారు. భయపడినకొద్దీ వారు మరింతగా లొంగదీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సాధించడం సులువు అవుతుందని సూచించారు.
"చంద్రబాబు ఒడ్డుపొడుగులో రేవంత్ రెడ్డి సగం ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం బాబుకు లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తీసుకుని చంద్రబాబుకు ఇమ్మని చెప్పా. నిలబడి పోరాడితో ఏమౌవుతుంది అని ప్రశ్నించారు. కేసులు పెండింగ్‌లో ఉన్నా భయపడేదేముందని అన్నారు. ఒకసారి జైలుకు పోయివచ్చారు కాబట్టి చలి తీరిపోయిందని వ్యాఖ్యానించారు. ఫైట్ చేయకుండా భయపడితే మరింత లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారని నారాయణ అభిప్రాయపడ్డారు.