Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌రో అల్ప‌పీడ‌నం... తిరుప‌తివాసులు అప్రమత్తంగా ఉండాలి

మ‌రో అల్ప‌పీడ‌నం... తిరుప‌తివాసులు అప్రమత్తంగా ఉండాలి
విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (15:20 IST)
న‌వంబ‌రు 26 నుంచి డిసెంబర్ 2 వరకు భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరిక కేంద్రాలు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్త వహించాలని  కోరారు.
 
 
తిరుప‌తి శివారులోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు,  వ‌ర‌ద ముంపు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివాసముంటున్నవారు తమ ఇళ్లలోని విలువైన వస్తువులు నగదు, నగలు, ఇంటి పత్రాలు వంటి వాటిని సురక్షిత ప్రాంతంలో భద్రపరచుకోవాలి అని కోరారు. రోడ్లపై ప్రయాణిం చేటప్పుడు తెలియని ప్రాంతాలలో నీటి క్రింద మ్యాన్ హోల్ ఉండవచ్చ‌ని, నడిచి వెళ్లేవారు, వాహనదారులు రోడ్డు పరిస్థితిని అంచనా వేస్తూ జాగ్రత్తగా వెళ్లాల‌ని సూచించారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో ఉన్న వాళ్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కి గానీ, దగ్గరలో ఉన్న పోలీస్ వారికీ తమ ప్రాంత పరిస్థితిని ఫోన్ ద్వారా స‌మాచారం అందించాల‌ని కోరారు. 
 

ఇళ్లలో వృద్ధులు చిన్న పిల్లలు ఉంటే, వారిపట్ల జాగ్రత్తలు తీసుకోవాల‌ని, సురక్షిత ప్రాంతంలో ఉన్న బంధువుల వద్దకు పంపంపాల‌ని, పిల్ల‌లు వరద ముంపు వలన ప్రమాదం ఏర్పడే వరకు అవకాశం ఇవ్వవ‌ద్ద‌న్నారు. ఈ దఫా పడనున్న భారీ వర్షాల కారణంగా చెరువులకు గండి పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయ‌ని, రిజర్వాయర్లలో నీరు అధికంగా చేరే ప్రమాదం ఉంద‌న్నారు. భారీ గాలులతో కూడిన వర్షం వలన చెట్లు విరిగి పడే ప్రమాదం ఉంద‌ని, కరెంటు స్తంభాలు ఒరిగి లైను తెగి పడే ప్రమాదం ఉంద‌న్నారు. చాలా కాలం క్రితం కట్టిన పాత భవనాలు నేలకొరిగే ప్రమాదముంద‌ని, అలాంటి పాత ఇళ్ళ‌లో ఉన్న‌వారు ఖాళీ చేయాల‌ని సూచించారు.
 

ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజలు కూడా తమ పైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాల‌ని కోరారు. చిత్తూరు  జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులన్నీ నిండి ఇప్పటికే పొర్లుతున్నాయి, 27వ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కురిసే అతి భారీ వర్షాల కారణంగా చెరువులు తెగిపోయే ప్రమాదం కూడా ఉందని, గ్రామాలలో ఉన్న వారు, పట్టణాలలో నగరాలలో లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని చెప్పారు. 
 

అత్యవసర పరిస్థితులలో సహాయం కోరదలచినవారు డయల్ 100, 8099999977, 63099 13960 నెంబర్లకు సమాచారం అందిస్తే, వెంటనే సంబంధిత రేస్క్యు ఆపరేషన్ పోలీసు సిబ్బంది సహాయం అందించడానికి అందుబాటులోకి వస్తార‌ని చెప్పారు. ఇప్పటికే పలు బృందాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రేస్క్యు ఆపరేషన్ పోలీస్ బృందాలు సిద్ధంగా ఉంచామ‌ని, సహాయక చర్యల్లో భాగంగా మీవంతు సహకారం అవసరమైన సమయంలో పోలీస్ వారికి అందించవలసినదిగా అర్బ‌న్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు విజ్ఞప్తి చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలి, తెలుగు మహిళలను వేధిస్తారా?