తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నివేదించిన ప్రకారం, మొత్తం 30 కంపార్ట్‌మెంట్లు శ్రీ వేంకటేశ్వరుని భక్తులతో నిండిపోయాయి. అదనంగా, ఉచిత సర్వ దర్శనం కోసం బయట పొడవైన క్యూలలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
కాగా, గురువారం స్వామివారి దర్శనార్థం 65,992 మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వీరిలో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.
ఇకపోతే, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఏప్రిల్ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అంటే ఆ రోజు (ఏప్రిల్ 2న) 11 గంటల తర్వాత నుంచి భక్తుల్ని దర్శనం కోసం అనుమతిస్తుంది టీటీడీ. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు.
అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలిక లక్షితపై దాడి జరిగిన అనంతరం ఇప్పటికే ఆరు చిరుతలను బోన్లలో బంధించి, వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు.