ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారి దర్శనం వద్ద తమ పెతాపం చూపిస్తూ, హల్చల్ చేస్తున్నారు. ఇటీవలికాలంలో తిరుమల కొండపై ఏపీ మంత్రుల ప్రవర్తన ప్రతి ఒక్కరూ విసుక్కునేలా కనిపిస్తుంది. ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తున్నప్పటికీ వారు మాత్రం ఏమాత్రం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ జాబితాలో తాజాగా మంత్రి రోజా కూడా చేరారు.
ఇటీవలికాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం కనీసం 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు, అధికార వైకాపా మంత్రులు, నేతలు భారీ సంఖ్యలో అనుచరగణంతో వచ్చి బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను తితిదే రద్దు చేసింది. వీఐపీ సిఫారసులను కూడా రద్దు చేసింది. అయితే, ఈ నిబంధనలు పక్కనబెట్టిన మంత్రి రోజా గురువారం ఏకంగా 50 మందికిపైగా అనుచరగణంతో వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దీంతో గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.
మంత్రి రోజా తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రవర్తించిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తితిదే అధికారులపై ఒత్తిడి తెచ్చి బ్రేక్ దర్శనం చేయించారని మండిపుడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా ఇదే విధంగా తన అధికారదర్పాన్ని కొండపై ప్రదర్శించిన విషయం తెల్సిందే.