Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ - తెలంగాణా సరిహద్దుల్లో పులి కలకలం

Advertiesment
Bengal Tiger
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఓ పెద్ద పులి కలకలం రేపుతోంది. ఖమ్మంపాడు - చిలుకూరు గ్రామాల మధ్య ఈ పులి కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. పైగా, ఆ పులి అటుగా వెళ్లడాన్ని తాము కూడా చూశామని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లోని సరిహద్దు గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ పులి జాడ కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. 
 
ఇటీవలి కాలంలో తరచుగా క్రూరమృగాలు జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జూన్‌లో విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో సంచరించిన పులి రెండు ఆవులపై దాడి చేసి ఓ దానిని చంపేసింది. 
 
గత నెలలో అనకాపల్లిలో ఓ పులి అటవీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక, మూడునాలుగు రోజుల క్రితం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం బొగ్గుల వాగు ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం వార్తలు కలకలం రేపాయి. 
 
తాజాగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు-చిలుకూరు గ్రామాల మధ్య పులి సంచరిస్తోందన్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పులి రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లడం చూశామని వ్యవసాయ కూలీలు కొందరు చెబుతున్నారు.  
 
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం అన్నవరం-దొడ్డ దేవరపాడు గ్రామాల మధ్య తాము పులిని చూసినట్టు మరికొందరు తెలిపారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 
 
ఆ పులి రోడ్డు దాటి ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడు-తొండలగోపవరం వైపు వచ్చినట్టుగా కూలీలు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కూలీలు పులిని చూసినట్టుగా చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, వారు చెబుతున్నట్టు అది పులి అయి ఉండకపోవచ్చని, హైనా అయి ఉండొచ్చని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించిన మహీంద్రా అండ్ మహీంద్రా