Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూపాయికే టిడ్కో ఇళ్లు, 2022 నాటికి గృహ ప్రవేశాలు చేయిస్తాం

Advertiesment
Tidco house
, గురువారం, 7 జనవరి 2021 (21:28 IST)
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తూ కేవలం ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. 
 
చంద్రబాబు హయాంలో టిడ్కో పేరుతో మోసం జరిగితే.. వైఎస్‌ జగన్‌ మాత్రం పేదలపై భారం పడకుండా వారి జీవితాల్లో ఆనందం నింపుతున్నారని అన్నారు. గురువారం జేఎన్‌టీయూ సమీపంలో టిడ్కో గృహ సముదాయం వద్ద మునిసిపల్‌ కమిషనర్‌ మూర్తితో కలిసి లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, అనంతపురం నియోజకవర్గంలో నిరుపేదలైన 30,154 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదని, వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. ఇళ్ల పేరుతో అనంతపురం నియోజకవర్గంలో గత ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేశారని,
 
కేవలం ఓట్లు దండుకునేందుకే టిడ్కో పేరుతో వచ్చారన్నారు. అధికారంలో ఉండగా ఒక్క ఇంటి నిర్మాణం చేయకుండా. తీరా అధికారం కోల్పోయాక ‘నా ఇల్లు-నా సొంతం’ అంటూ ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం పేదలపై భారం పడకుండా చూస్తున్నారన్నారు.
 
300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు స్కీం ప్రకారం లబ్ధిదారులు కేంద్ర, రాష్ట్ర వాటా పోను బ్యాంక్‌ లోన్‌ తీసుకుని ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉండేదన్నారు. 20 ఏళ్ల తర్వాత ఇంటిపై హక్కు వచ్చేదన్నారు.

కానీ సీఎం జగన్‌ మాత్రం ఆ భారం లేకుండా చేశారని తెలిపారు. నియోజకవర్గంలో 2086 మందికి టిడ్కో ఇళ్లను అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులపై భారం పడకుండా, ప్రతి నెలా కట్టుకునే పరిస్థితి లేకుండా బాబు స్కీం కావాలా? జగనన్న స్కీం కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా అడిగితే ఒక్కరు మినహా అందరూ ‘జగనన్న స్కీం’ కావాలని చెప్పారన్నారు. 
 
దీన్నిబట్టి ‘జగనన్న స్కీం’ పట్ల ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి 2022 సంక్రాంతి నాటికి గృహప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సొంత ఆస్తిని కల్పించారని గుర్తు చేశారు.
 
ఆయన తనయుడిగా వైఎస్‌ జగన్‌ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించారన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 95 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు.
 
సచివాలయ వ్యవస్థ తెచ్చి వాలంటీర్లను పెట్టి ప్రతి కుటుంబం గడప వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలను గత ఉగాది నాటికే ఇవ్వాలని భావించినా 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కారణంగానే ఆలస్యమైందన్నారు.
 
గత ఎన్నికల్లో ఓడించారన్న అక్కసుతో కోర్టుల ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ మహాయజ్ఞంలా సాగుతోందని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.
 
ప్రభుత్వం చేస్తున్న మంచి పని నుంచి ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆశీర్వాదాలు జగన్‌కు ఉన్నాయని, నిర్వఘ్నంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 
 
ఇంటి స్థలాలకు సంబంధించి అర్హులు ఉంటే సచివాలయాల్లో సంప్రదించాలని, 90 రోజుల్లో పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందు టిడ్కో గృహ సముదాయం నిర్మాణాలకు సంబంధించి మిక్సింగ్‌ ప్లాంట్‌ను ఎమ్మెల్యే అనంత రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రయాణికులకు శుభవార్త, పండుగ సీజన్ నేపధ్యంలో స్పెషల్ ట్రైన్స్