నిర్ధారణ పరీక్షలు చేస్తేనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమని భావించామని, టెస్టులు నిర్వహించటంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.
కోవిడ్‌పై త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లామని చెప్పారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదని, 8 నెలల్లోనే 150 నిర్ధారణ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శాసనమండలిలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 దశల్లో ప్రతి ఇంటిని ఆరుసార్లు సర్వే చేశాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న 5 లక్షల 50 వేల మందికి హోం కిట్లను అందచేశాం. కరోనా నేపథ్యంలో వైద్యం కోసం 22 వేల మందిని తాత్కాలికంగా నియమించాం. వారిలో ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా తొలగించలేదు.
తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు 232 కోట్ల రూపాయలు విడుదల చేశాం. త్వరలో మరో 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని చేప్పారు. కోవిడ్ ట్రీట్మెంట్‌కు అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకున్నాం.
దేశంలోనే కోవిడ్ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్ రేటు 17.2 ఉంటే ప్రస్తుతం 8.63 రేటుకు తగ్గించాం.
రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.68 ఉంటే మన రాష్ట్రంలో 97.86గా ఉంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.46 ఉంటే మన రాష్ట్రంలో 0.81గా ఉందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.