ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కోవిడ్ ఆస్పత్రులలో పూర్తి స్థాయిలో వైద్యులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. రోగులకు ప్రతి చోటా సంతృప్తికర స్థాయిలో సేవలు అందాలి. కోవిడ్ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలకు అనుగుణంగా వాటికి రేటింగ్ ఇవ్వాలి. అన్ని ఆస్పత్రులలో వైద్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కోవిడ్ నివారణపై జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.
"ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలి. కోవిడ్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి వేతనాలు పెంచాలి. చికిత్స పొందుతున్న వారికి మంచి భోజనం అందాలి. ఇప్పుడు తీసుకున్న 287 ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు, సరైన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది సంతృప్తికర స్థాయిలో ఉండాలి. ఆ మేరకు వీలైనంత త్వరగా నియామకాలు పూర్తి చేయాలి.
అవి లేకపోతే కోవిడ్ సోకిన వారికి సరైన సేవలు అందించలేం. నిరంతరంగా ఆస్పత్రుల్లో ప్రమాణాలను పర్యవేక్షించాలి. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి సేవలు సక్రమంగా అందాలన్న సీఎం. మందులు ఇవ్వడం, చికిత్స అందించడంతో పాటు, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చే వ్యవస్థ సక్రమంగా ఇవ్వాలి.
ఇవే కాకుండా కోవిడ్ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న వాటిపై బాగా ప్రచారం చేయాలి. ప్రతి రోజూ ఈ అంశాలను పర్యవేక్షిస్తే నాణ్యమైన సేవలు అందుతాయి.
రిఫరల్ ప్రోటోకాల్:
ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలి. మనమే ఆస్పత్రులకు వెళ్లినప్పుడు ఎలాంటి సేవలు కోరుకుంటామో ఆ విధానాలు కచ్చితంగా అమలు కావాలి. అన్ని చోట్ల రిఫరల్ ప్రోటోకాల్ చాలా స్పష్టంగా ఉండాలి. విలేజ్, వార్డు క్లినిక్స్ నుంచి ఆ ప్రోటోకాల్ అమలు జరగాలి.
ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల సమాచారంతో పాటు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఒక కాల్ సెంటర్ నంబర్ పెట్టాలి, అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆ బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. పేషెంట్‌ను ట్రీట్ చేయకుండా, అనవసరంగా రిఫర్ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చెప్పాలి.
హెల్ప్ డెస్క్ లు:
ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు మరింత సమర్థంగా పని చేయాలి. రోగికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు, వారికి తగిన వైద్య సేవలు అందేలా ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్‌లు పని చేయాలి. ఆరోగ్య ఆసరా పథకం సక్రమంగా అమలు అయ్యేలా కూడా ఈ హెల్ప్ డెస్క్‌లు చూడాలి.
రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజునే, వైద్యులు వారికి సూచించినంత కాలం ఆర్థిక సహాయం అందించేలా ఈ డెస్క్‌లు పని చేయాలి. ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డ ఇంటికి వెళ్లేటప్పుడు వారికి ఆర్థిక సహాయం అందించడంలో కూడా హెల్ప్ డెస్క్‌లు పని చేయాలి. ఆస్పత్రి నుంచి తల్లి, బిడ్డ డిశ్చార్జి అవుతున్నప్పుడే డబ్బులు వారి అక్కౌంట్‌లో పడాలి" అని సీఎం అధికారులను ఆదేశించారు.