హైదరాబాద్ నగరం అత్యాచారాలకు నిలయంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. వరుస అత్యాచార, అత్యాచారయత్న ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనకు ఒక్క రోజు ముందు హైదరాబాద్ నగరంలో ఓ మానసిక వికలాంగురాలిపై ఇద్దరు ఆటోడ్రైవర్లతో పాటు.. మొత్తం ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను పరిశీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని కుల్సుంపురా పరిధిలో 19 ఏళ్ల మానసిక వికలాంగురాలు తల్లి, సోదరులతో కలిసి నివసిస్తోంది. మతిస్థిమితం లేని యువతి అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోవడం, సోదరులు వెళ్లి తీసుకురావడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి పురానాపూల్ చౌరస్తా వద్దకు చేరుకుంది.
అక్కడ ఆమెను ఒంటరిగా చూసిన ఆటోడ్రైవర్లు ఖలీమ్ (28), అతడి బంధువు అబ్దుల్ అజీజ్ (38)లు యువతి వద్దకు వెళ్లి ఇంటి దగ్గర దించుతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. అనంతరం మూసీ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే రోజు రాత్రి 8:30 గంటలకు బాధితురాలిని జుమ్మెరాత్ బజార్‌లో దింపి, అక్కడే ఉన్న బ్యాండ్‌మాన్ నజీర్ (46)కు అప్పగించి ఆమె అడ్రస్ తెలుసుకుని వారి ఇంట్లో అప్పగించాలని చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లగానే నజీర్ కూడా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం అర్థరాత్రి వేళ ఆమెను పురానాపూల్ చౌరస్తాలో వదిలి వెళ్లిపోయాడు.
అయితే, తన సోదరి కనిపించకపోవడంతో అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె సోదరులు.. పురానాపూల్ వద్ద కనిపించిన ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె తనపై జరిగిన అఘాయిత్యాన్ని సైగల ద్వారా వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మానసిక నిపుణులు, వైద్యుల సాయంతో ఆమెను మాట్లాడించి చికిత్స అందించారు. ఆమె చెప్పిన దానిని బట్టి అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిపై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.