ఏపీలోని కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలి నాగులాపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో కలిపే సమయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ గ్రామానికి చెందిన యువకులంతా కలిసి వినియకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్టదైవానికి నవరాత్రుల పేరిట వివిధ రకాలైన పూజలు చేశారు. ఆ తర్వాత విగ్రహ నిమజ్జన వేడుకల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. తమ గ్రామంలోని విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయాలని భావించారు.
విగ్రహాన్ని ఊరేగించుకుంటూ వెళ్లి ఉప్పాడ సమీపంలోని హార్బర్ వద్ద నిమజ్జనం చేశారు. అయితే, ఆ సమంయలో అలల తీవ్ర ఎక్కువగా ఉండటంతో సముద్రంలో నిమజ్జనం చేసిన విగ్రహం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీన్ని గమనించిన కొందరు యువకులు మన విగ్రహం ఒడ్డుకు కొట్టుకొస్తుందని చెప్పారు. వెంటనే వారంతా వెనక్కి వెళ్లి విగ్రహాన్ని సముద్రంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు.
ఇంతలో ఓ రాక్షస అలకు విగ్రహంతో ముగ్గురు యువకులు సముద్రంలోకి వెళ్లిపోయారు. వీరి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ మాత్రం తెలియడం లేదు. గల్లంతైన యువకులను సతీష్, విజయ్ వర్ధన్‌లుగా గుర్తించారు. వెంకట రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు.