Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఎమ్మెల్యేలకు ఆకలి బాధ తెలుసా?: పవన్

ఆ ఎమ్మెల్యేలకు ఆకలి బాధ తెలుసా?:  పవన్
, శుక్రవారం, 15 నవంబరు 2019 (18:21 IST)
"బొత్సకి గాని, మిగతా 150 మంది ఎమ్మెల్యేలకు గాని ఆకలి బాధలు తెలుసా? ఒకవేళ మీకు ఆ బాధ తెలిసి ఉంటే మీ విధివిధానాలతో ఈరోజున ఇంత మందిని చంపి ఉండరు. ఇది చాలా కడుపు మండుతున్న విషయం. 1400 మంది చనిపోయారన ఓదార్పు యాత్ర చేసిన జగన్‌.. ఆత్మహత్య చేసుకున్న భవన కార్మికుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదు?

ఓట్ల కోసం సొంత డబ్బులు పంచిన నేతలు.. కార్మికులకు ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఇవ్వరు?" అంటూ పవన్ మండిపడ్డారు. మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి.. భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 
 
"సగటు మనిషి బతికేలా సామాజిక పరిస్థితులు ఉండాలనే కారణంతోనే జనసేన పార్టీ ఆవిర్భవించింది. సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చెయ్యడం చాలా కష్టమైన పని. సినిమాల్లో ఇలాంటి సీన్ చేస్తే చప్పట్లు కొట్టి చాలా బాగుంది అంటాము. కానీ వాస్తవంలో ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి చాలా కష్టపడాలి.

రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చు కానీ నిజ జీవితంలో సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. 
 
నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోరుకోలేదు. సగటు మనిషికి అండగా నిలబడాలి అని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను మీ గొంతు అవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను. మీ కడుపు మండితే మీ కడుపు మంట నా గొంతుగా మారి మీ కడుపును చల్లార్చాలని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. 
 
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను 5 నెలలు వదిలేసి, 50 మందిని చంపేసి( చంపేసి అని ఎందుకు అంటున్నాను అంటే మనుషులను గొడ్డలితో నరికి చంపనవసరం లేదు, ఒక తప్పుడు పాలసీ ను అమలు చేసి కూడా చంపెయ్యోచ్చు) ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేస్తున్నారు.
 
 ఈ రోజున మీకు భోజనాలు పెడుతున్నామంటే భోజనానికి దిక్కు లేక కాదు, నాకు ఏడుపొచ్చి..మీకు అండగా మేము ఉన్నాం అని చెప్పడానికే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మీకు వేరే ఎక్కడొక చోట ఆహరం లభించొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికే ఈ ఆహార శిబిరాలను ఏర్పాటు చేసాం.

డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఈరోజున నా అభిమానులు, జనసైనికులు అనేక చోట్ల ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు లేని చోట కూడా ఈరోజు ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇది మీ అందరికీ చాలా ధైర్యం కలిగిస్తుంది. ఒక పక్కన ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆత్మస్తైర్యం తీసేసి, ఆత్మహత్యలకు గురిచేసేలా చేస్తుంటే..మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు మేము అండగా ఉన్నాం అని చెప్పడానికి ఈరోజు ఆహార శిబిరాలు ఏర్పాటు చేశాం.

గత ప్రభుత్వం చేసిన తప్పులను నేను చాలా బలంగా ఎండగట్టాను. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో మొత్తానికి ఇసుకను కుళాయిలో వచ్చే నీరు మాదిరిగా ఆపేస్తే ఈరోజున 35 లక్షల మంది రోడ్డున పడ్డారు. 151 సీట్లు ఇచ్చిన వైసీపీ విధివిధానాల వల్ల ఎందుకు మనకి పని దొరకట్లేదు, ఎందుకు మనకి డబ్బులు రావట్లేదు అని మనకి అనిపించదు.

జగన్ రెడ్డి అంటే వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు. అలా కాకుండా ఏమని అనాలి అండి జగన్ రెడ్డి గారిని? నిన్న చెప్పినట్టుగా మీ 151 మంది ఎమ్మెల్యేలు కూర్చుని జగన్ రెడ్డి ని ఏమనాలో తీర్మానం చెయ్యండి. నేను వ్యక్తిగత ద్వేషం లేనివాడిని, నాకు శత్రువులు ఉండరు. కానీ ప్రజల సమస్యల కోసం శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థులుగా భావిస్తాను. 
 
జగన్ తో గాని, చంద్రబాబుతో గాని నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ వారి విధివిధానాలు ప్రజలను చంపేస్తుంటే ప్రజలు కోసం నేను వారి మీద శత్రుత్వం పెట్టుకుంటాను.
 
 ఇసుక వారోత్సవాలు చెయ్యడానికి మీకు 5 నెలలు సమయం కావాలా? 50 మంది చనిపోవాలా? మీరు ఎప్పుడైనా పస్తులు ఉన్నారా? మీ వల్ల భవన నిర్మాణ కార్మికులు రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు. 
ఒకతను వచ్చి మీరు కూడా మాతో భోజనం చెయ్యండి అని అడిగారు, నేను కార్తీకమాసం చేస్తాను, సాయంత్రం పూట మాత్రమే తింటాను అని చెప్పాను.

ఇంకోరోజు మీతో కూర్చుని తింటాను. కార్తీకమాసం వల్ల మీతో కలిసి తినలేకపోతున్నాను, అందుకోసం మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. బొత్సకి గాని, మిగతా 150 మంది ఎమ్మెల్యేలకు గాని ఆకలి బాధలు తెలుసా? ఒకవేళ మీకు ఆ బాధ తెలిసి ఉంటే మీ విధివిధానాలతో ఈరోజున ఇంత మందిని చంపి ఉండరు. ఇది చాలా కడుపు మండుతున్న విషయం.

ప్రజాస్వామ్యంలో మనకెందుకు అని చేతులు కట్టుకుని కూర్చుంటే ఒక్కొక్కడు తల మీద ఎక్కి తైతెక్కలు ఆడతారు. తైతెక్కలు ఆడేవాళ్ళని తల మీద నుండి దింపి నేలకేసి కొట్టాలి. ఈరోజున అమరావతిని వైసీపీ వాళ్ళు రాజధానిగా వద్దంటున్నారు..వేల ఎకరాలు చంద్రబాబు గారు ప్రజల దగ్గర తీసుకుంటుంటే ప్రతిపక్షం లో ఉన్న వైసీపీ ఎం చేసింది? ఆరోజున మీరందరూ కూర్చుని ఏకగ్రీవ తీర్మానం చేస్తేనే కదా ఈరోజు అమరావతి వచ్చింది.

ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత , ప్రధాని గారి చేత శంఖుస్థాపన అయిన తర్వాత చంద్రబాబు గారి మీద కోపంతోనో లేక ప్రధాని గారి మీద కోపంతోనో రాజధానిని ఆపేస్తే భవన నిర్మాణ కార్మికుల్లా అనేక మంది పస్తులతో బాధ పడాలి. అమరావతి విషయంలో గత ప్రభుత్వ విధివిధానాలు నచ్చకపోతే వాటిని కుదించి కొత్త విధివిధానాల ద్వారా అమరావతి నిర్మాణం జరిగితే భవన నిర్మాణ కార్మికులు పక్క రాష్ట్రం వలస వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకుంటారు. 
 
కావాలంటే రాజధానిని పులివెందులలో పెట్టుకోండి, నేను కూడా వస్తాను. త్వరగా ఏదొక నిర్ణయం తీసుకోండి. నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను పులివెందులలో రాజధాని పెట్టుకుంటా అంటే సంతోషమే! ప్రజల ఆమోదం తీసుకుని త్వరగా తీర్మానం పెట్టండి.

గత ప్రభుత్వంలా కాకుండా గొప్పగా పాలన అందిస్తే మేము సంతోషపడతాము. మా పార్టీ నిర్మాణం కొరకు సంవత్సర కాలం పాటు బయటకు రాకుండా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అని అనుకున్నాము, కానీ వీరి విధివిధానాల వల్ల 5 నెలల్లోనే బయటకు రావాల్సి వచ్చింది. 
 
అద్భుతమైన మెజారిటీ వచ్చిన ప్రభుత్వాన్ని తిట్టడానికి నేను మీలా రెగ్యులర్ రాజకీయ నాయకుడిని కాదు. చాలా వేదనతో రాజకీయాల్లోకి వచ్చినవాడిని. సగటు మనిషి వేదనలు తగ్గాలి అని భావనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 
 
151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం సరిగ్గా పాలన అందిస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తాను. నేను శాపనార్ధాలు పెడుతున్నాను అని వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారు. నేను శాపనార్ధాలు పెడితే మీరు భయపడడానికి నేను ఏమైనా ఋషి నా? ఒక సమూహం తాలూకు కడుపు మంట కచ్చితంగా శాపం అవుతుంది. 
 
50 మంది చనిపోతే ఆ బాధ ఎలా ఉంటాది? ఇదే మీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో అన్నం లేకుండా చేస్తే మీరు ఊరుకుంటారా? అలా చేస్తే బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లిలో రోడ్డు మీదకు వచ్చి వీరంగం సృష్టిస్తారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చక్కని పరిపాలన అందించాలని కోరుతున్నాను.

ఒకవేళ మీరు అలా చెయ్యని పక్షంలో మేము చాలా బలంగా పోరాటం చేస్తాం..జనసైనికులు చాలా బలం కలవారు, గుర్తుపెట్టుకోండి. మేము చాలా సైద్ధాంతిక బలంతో రాజకీయాల్లోకి వచ్చాము. 
 
ఆ పార్టీలో ఇద్దరిని, ఈ పార్టీలో ఇద్దరిని లాక్కొని రాజకీయాలు చెయ్యడానికి మేము రాజకీయాల్లోకి రాలేదు. ఒకవేళ ఎవరైనా పార్టీలోకి వచ్చినా గాని మా సిద్ధాంతాలను అర్ధం చేసుకోమని చెప్తాం. అలా వచ్చినవారిలో కొంత మంది ఉన్నారు, అవకాశవాదంతో వచ్చిన వారు వెళ్లిపోయారు. పార్టీకు అండగా నిలబడే వాళ్లే కావాలి గాని నిలబడలేని వారు మాకు అవసరం లేదు. 
 
 ఒత్తిడి తీసుకోలేని వారు రాజకీయాల్లో నిలబడలేరు. దొడ్డి దారుల్లో జనసేనలోకి వస్తానంటే కుదరదు. మొన్న లాంగ్ మార్చ్ కి వచ్చిన వారిలో మూడో వంతు భవన నిర్మాణ కార్మికులైతే, ఒక వంతు జనసేనకు సంబంధం లేని ప్రజలు అయితే మరొక వంతు జనసైనికులు. 
 
వచ్చిన 5 నెలల్లో 50 మందిని చంపేసి ప్రజా వ్యతిరేఖత వైసీపీ వాళ్ళు కూడగట్టుకున్నారు. అంతటి ఘనత వైసీపీ వారు సాధించారు.  భవన నిర్మాణ కార్మికులకు మరియు ఇతర అనుబంధ రంగాల వారికి మాట ఇస్తున్నా..మీ పోరాటమే మా పోరాటం.
 
 గతంలో 1400 మంది చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర పేరుతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లారు. ఈరోజు 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే నష్టపరిహారం ఇవ్వడానికి వారికి మనస్సు ఒప్పట్లేదు. 
 
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నష్టపరిహారం ఇవ్వడానికి మనస్సు ఒప్పట్లేదా? ప్రగల్బాలు పలకడానికేనా మీరు ఉంది? ఆరోజున వైసీపీ కి ఓటు వేసిన ప్రజలు పిలిస్తేనే నేను రాజధానికి వచ్చా..తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదురెళ్లి భూసేకరణ చట్టాన్ని జనసేన ఆపింది. ఆరోజున వైసీపీకు భూసేకరణ చట్టాన్ని ఆపేంత దమ్ములేదు.
 
 చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే! మేము మీ సొంత డబ్బు ఇమ్మనట్లేదు, ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన శిస్తును నష్టపరిహారంగా ఇవ్వమని అడుగుతున్నాము. 

5 నెలలుగా పని లేకుండా బతుకుతున్న భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10000 రూపాయలు చొప్పున 50000 రూపాయలు ప్రభుత్వం తరపున ఇవ్వండి. ఈ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించి ప్రజలకు అండగా నిలవాలి" అని సూచించారు.

ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు సీరియస్ : గన్నవరం ఎమ్మెల్యేపై వేటుపడింది