వైసీపీ మంత్రి కన్నబాబుపై ‘లాంగ్‌మార్చ్’ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నాయకుడిగా మాట్లాడే కన్నబాబును తాము రాజకీయాల్లోకి తీసుకొచ్చామని.. ఇక్కడున్న నాగబాబు గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పవన్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ‘వైజాగ్ నుంచి మంత్రి అయి ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారా.. మీ బతుకులు తెలియవా మీరెక్కడ నుంచి వచ్చారో’ అని పవన్ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను, మరో మంత్రి కన్నబాబును ఉద్దేశించి ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారం సమయంలో కూడా కన్నబాబుపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ చెంచా’ అని కన్నబాబును ఉద్దేశించి అప్పట్లో పవన్ వ్యాఖ్యానించారు. ‘రా బయటకు రా.. నీ సంగతి చూస్తా.. ఏమనుకుంటున్నావ్ నువ్వు’ అని ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్నే రేపాయి.
పవన్ ఈ తరహా వ్యాఖ్యలు ‘లాంగ్‌మార్చ్’ సందర్భంగా జరిగిన సభలో మళ్లీ చేయడంతో.. కన్నబాబు రాజకీయ ప్రస్థానంపై నెటిజన్లు వెతుకులాట మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు జర్నలిస్ట్‌గా పనిచేశారు.
చిరంజీవితో ఉన్న సత్సంబంధాల మూలంగా 2009లో కాకినాడ రూరల్ నుంచి పీఆర్పీ టికెట్ దక్కించుకుని గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2015లో వైసీపీలో చేరిన కన్నబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన సందర్భంలో కూడా చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కన్నబాబు చెప్పారు.
చిరంజీవితో మంత్రి కన్నబాబుకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల కన్నబాబు సోదరుడు గుండెపోటుతో మృతి చెందిన సమయంలో కూడా చిరంజీవి కాకినాడకు వెళ్లి కన్నబాబును పరామర్శించారు.
చిరంజీవి సోదరుడు పవన్‌తో మాత్రం మంత్రి కన్నబాబుకు సఖ్యత ఉన్నట్టుగా కనిపించడం లేదు. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితులు ఉండటంతో రానున్న రోజుల్లో ఈ విమర్శలు ఏ స్థాయికి వెళతాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.