ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులతో మంగళగిరిలో తళుక్కున మెరిశారు. ఆయన శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా తన ఇద్దరు కుమారులతో కలిసివున్న ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు మాత్రం తండ్రీ తనయుడులు అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి నివాసానికి చేరుకున్న పవన్.. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు.
అనంతరం అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. మంగళగిరిలో పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా, రూ.1290 కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.