రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని తెలుగు ప్రజలందరూ ఆ పార్టీని పూర్తిగా పక్కనబెట్టేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కనిపించకుండానే పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధినాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
పాత నేతలను పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నించి కొంతమందిని తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. నిన్న ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కెవిపి, పల్లంరాజు, హర్షకుమార్, శైలజానాథ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గురించే చర్చ జరిగిందట.
అయితే ఇందులో ప్రధానంగా కెవిపితోనే చర్చ ఎక్కువగా జరిగిందట. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వున్న గ్రౌండ్ రిపోర్ట్ కెవిపి బాగా వివరించారట. కనుక జగన్ పాలన గురించి బాగా తెలుసుకుని వున్న కెవిపితోనే వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలని ఆలోచన చేసారట.
అందుకే కెవిపిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఆట్టే సమయం లేదు కనుక ప్రారంభం నుంచే దూకుడుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా జగన్ చరిష్మాను తగ్గించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చని నమ్మకంలో ఉన్నారట రాహుల్ గాంధీ.