Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సర్కారు అనాలోచిత చర్యలతో లక్ష్యానికి దూరం

Advertiesment
ఏపీ సర్కారు అనాలోచిత చర్యలతో లక్ష్యానికి దూరం
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (08:09 IST)
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులలో 2019 మొదటి వరకూ ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేదని, నేడు అథమస్థానానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత, ఉపాధి పనులు పూర్తిగా మందగించాయని పేర్కొన్నారు. గురువారం ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఉపాధిహామీ పథకం  చట్టం నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా  వేర్వేరు పనుల కోసం మెటీరియల్ కాంపోనెంట్ సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. మూడు దశల్లో రాష్ట్రానికి  రావాల్సిన రూ. 2230 కోట్లకు గానూ కేంద్ర ప్రభుత్వం రూ. 1969 కోట్లు  మంజూరు చేసినా, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం, 31 మార్చి 2019 నాటికి మెటీరియల్ కాంపోనెంట్‌కు పెండింగ్‌లో ఉన్నది రూ. 1610 కోట్లు, 2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబర్ 4 వరకు మరో రూ. 691 కోట్ల మేరకు ఉపాధిహామీ పథకం  నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా రాష్ట్ర  ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు చెల్లించేందుకు సుముఖత చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతోపాటు అనుసంధానం  కింద జరుగుతున్న పనులను నిలిపేయాలని ప్రభుత్వం ఇచ్చిన  ఆదేశాలతో అటవీశాఖ కన్వర్జెన్స్ పనులు నిలిపేయడం అభివృద్ధి  పనులకు తీవ్ర ఆటంకం కానుందన్నారు.

మరోవైపు కేంద్రం నిర్దేశించిన కార్యక్రమానికి నిధులు విడుదల చేసినప్పుడు...ఆ నిధుల స్వీకరణ తేదీ నుంచి మూడు రోజుల్లోగా రాష్ట్ర  వాటాని ఉపాధి హామీ నిధికి జమ చేయాలి, అలా చేయని పక్షంలో తదుపరి నిధుల విడుదలను కేంద్రం నిలిపేస్తుందని స్పష్టమైన నిబంధనలున్నా ఏపీ సర్కారు పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నించారు.

దీంతోపాటు రాష్ట్ర  వాటా చెల్లింపు ఆలస్య కాలానికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉన్నా ..స్పందించకపోవడం దారుణమన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా 25 శాతం లోపు అయిన పనులన్నింటినీ నిలిపి వేయాలని ఏపీ సర్కారు ఇచ్చిన ఆదేశాలు పంచాయతీల ప్రగతి, ప్రజల ఉపాధిపై గొడ్డలిపెట్టులాంటి నిర్ణయమని ఆరోపించారు.

కూలీ చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ కింద జరిగే ఈ పనులతో సామాజిక, గ్రామ అవసరాలు తీరనున్నాయని, అటువంటి పనులను ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో ఆగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పల్లెల్లో రాజకీయ ఆధిపత్యం ఆశించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 

ఉపాధిహామీ  క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, సహాయకులు గత కొద్ది నెలలుగా తీవ్ర అభద్రతా భావంతో రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. ఉపాధి లక్ష్యాలను సాధించడంలో ఎంతో శ్రమించిన క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, సహాయకులపై ప్రభుత్వం కక్ష సాధించే ధోరణితో వ్యవహరించడం చాలా అన్యాయమన్నారు.

గ్రామవలంటీర్ల నియామకంతో తమ ఉద్యోగాలుంటాయో ఊడుతాయో అనే అయోమయంలో ఉన్నారని..వీరి ఉద్యోగ భద్రతకు భరోసా నివ్వాల్సిన అవసరం ఉందన్నారు.  జూన్ నెల నుంచి వీరికి గౌరవవేతనాలు కూడా అందలేదని, తక్షణం వీరి బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 
 
2014 నుంచి 2019 ఆరంభం వరకూ ఉపాధిహామీ సాధించిన ప్రగతి అంతా నాలుగు నెలల్లో అథోగతికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకూ 26000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు వేశారని, 6 వేల అంగన్ వాడీ భవనాలు నిర్మించారని, 2200 గ్రామపంచాయతీ భవనాలు నిర్మించారని , 12,000 కిలోమీటర్ల రోడ్లు వేసి పల్లెలకు రహదారి సౌకర్యం కల్పించారని, 10 వేల సంపద కేంద్రాలు నిర్మించారని, 7,00,000 పంట కుంటలు తవ్విదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  నిలిచిందని పేర్కొన్నారు.

ఉపాధి నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానం చేస్తూ సాధించిన విజయాలు దేశంలోనే ఏపీని మొదటిస్థానంలో నిలిపాయన్నారు. ఉపాధి పనుల కల్పన, లక్ష్యాలు చేరుకోవడం, మెటీరియల్ కాంపోనెంట్ చెల్లింపు,  వందల అవార్డులు, రివార్డులు అందుకున్నఏపీ నేడు ఉపాధిలో దయనీయ స్థితికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రాష్ట్ర  ప్రభుత్వం ఉద్దేశపూర్వక చర్యలతో లక్షలాది మంది ఉపాధి కూలీలు, వేలాది మంది ఉపాది సిబ్బంది తమ కుటుంబాలతో సహా నడిరోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

"రాష్ట్ర  ప్రథమపౌరుడిగా గవర్నర్ జోక్యం చేసుకుని ఏపీలో రాజకీయ కారణాలతో నిర్వీర్యమవుతున్న ఉపాధి హామీ పథకానికి ఊపిర పోయాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉపాధి చట్టాలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర  ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం.

ఉద్దేశపూర్వకంగా, కక్షతో నిలిపేసిన బిల్లు చెల్లింపులను వెంటనే చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఆదేశించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించాలి..అలాగే వారి ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలి..మెటీరియల్ కాంపోనెంట్ రాష్ట్ర  వాటా వెంటనే జమచేయాల్సిందిగా గవర్నర్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ  అనాలోచిత చర్యలతో నిలిచిపోయిన 25 శాతం లోపు నిలిపేసిన పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు రాజనాధ్‌ కు ఆహ్వానం