Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్‌కు షాక్... విధుల్లో చేరని 18వేల మంది గ్రామ వాలంటీర్లు...

Advertiesment
సీఎం జగన్‌కు షాక్... విధుల్లో చేరని 18వేల మంది గ్రామ వాలంటీర్లు...
, శనివారం, 17 ఆగస్టు 2019 (08:01 IST)
ప్రతి విషయంలోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ ప్రభుత్వానికి.. గ్రామ వాలంటీర్లు రివర్స్ షాకిచ్చారు. వైసీపీ నేతలు ఎంపిక చేసినా వాలంటీర్ల ఉద్యోగాల్లో చేరేందుకు విముఖత చూపుతున్నారు. ఏకంగా 18 వేల మంది  చేరలేదంటే.. ఆ ఉద్యోగాల్లోని డొల్లతనం ఇట్టే తెలిసిపోతోంది.
 
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ల నియామకాల్లో ఎంపికైన వారిలో 18 వేల మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి లేదంటూ వెనక్కి తగ్గడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో దాదాపు 2.69 లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక చేసింది.

వీరికి నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనాన్ని సైతం నిర్ణయించింది. అయితే ఇస్తున్న గౌరవ వేతనంతో పోలిస్తే చేయాల్సిన విధులు ఎక్కువగా ఉన్నాయన్న సాకుతో 18 వేల మంది తప్పుకున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం రికార్డు స్ధాయిలో భర్తీ చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులకు తాజాగా రాతపరీక్షలు నిర్వహించింది 2.69 లక్షల మందిని ఎంపిక చేసింది.

వీరికి అవసరమైన ప్రాధమిక శిక్షణ కూడా ఇచ్చింది. గ్రామ సచివాలయాలకూ, ప్రజలకు మధ్య సంధాన కర్తలుగా ఉంటూ నిజాయితీగా విధులు ఎలా నిర్వర్తించాలో వారికి అధికారులు వివరించారు. ఈ దశలో తమకు ఇస్తున్న గౌరవ వేతనం, తమకు అప్పగించిన విధులు పోల్చుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 వేల మంది వాలంటీర్లు విధుల్లో చేరకుండా మిన్నకుండి పోయారు. వీరిని మినహాయించి మిగిలిన వారందరికీ నియామక పత్రాలు, ఐడీ కార్డులు ఇచ్చి ప్రభుత్వం నిన్నటి నుంచి విధుల్లో చేరాల్సిందిగా ఆదేశించింది.
 
ఏపీలో ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీ, మీ సేవలో అందించే సేవలతో పాటు గ్రామ, వార్డు స్ధాయిలో అన్ని అనుమతులు, ధృవపత్రాల జారీ దరఖాస్తులు వంటి ఎన్నో సేవలను గ్రామ వాలంటీర్ల సాయంతో పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది.

మిగిలిన పనుల పరిస్ధితి ఎలా ఉన్నా... రేషన్ సరుకులు ఇంటింటికీ చేరవేయడాన్ని నామోషీగా భావిస్తుండటం, ఇంత చదువు చదువుకునీ రేషన్ సరుకులు మోసుకోవాలా అన్న భావన వ్యక్తం కావడంతో వేల సంఖ్యలో ఎంపికైన వాలంటీర్లు విధులకు దూరమయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో స్విగ్గీ, జోమోటో, ఉబర్ ఈట్స్ వంటి సంస్ధల్లో వేల సంఖ్యలో డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు.

వీరికి నెలకు తక్కువలో తక్కువగా 10 వేల రూపాయల వేతనం అందుతోంది. ఇక ఇతరత్రా రూపాల్లో మరో రెండు, మూడు వేల రూపాయలు ఇన్సెంటివ్స్ రూపంలో లభిస్తోంది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం వాలంటీర్లకు ఇస్తున్న ఐదువేల రూపాయల గౌరవ వేతనంతో పోలిస్తే ప్రైవేటు సంస్ధలు ఇస్తున్న వేతనాలు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి.
 
అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. తాము నియమిస్తున్న గ్రామ వాలంటీర్లు సేవా భావంతో స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసేందుకు వస్తున్నారనేది ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో వారిలో కష్టపడే తత్వం, నైపుణ్యాల ఆధారంగా భవిష్యత్తులో వీరిని నాయకులుగా ప్రోత్సహిస్తామని స్వయంగా సీఎం జగన్ ఆగస్టు 15న ఏర్పాటు చేసిన వాలంటీర్ల సమావేశంలో హామీ కూడా ఇచ్చారు.

దీంతో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. మొత్తం ఎంపికైన వాలంటీర్లలో 18 వేల మంది వెనక్కి తగ్గిన నేపథ్యంలో రాతపరీక్షల్లో వారి కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

అదే జరిగితే వెనక్కి తగ్గిన వాలంటీర్ల స్ధానంలో మరో 18 వేల మందికి ఉద్యోగాలు ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాల రాకతో వాలంటీర్ల వ్యవస్ధ, వారి పనితీరు విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు మళ్లీ ఫోన్ చేయొద్దండీ... పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరికి?