Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లబ్‌డబ్‌.. లబ్‌డబ్‌.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ - మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు!

counting centres

వరుణ్

, సోమవారం, 3 జూన్ 2024 (08:27 IST)
సార్వత్రిక ఎన్నికల సమరంలో నెలలు తరిగిపోయాయి.. వారాలు కరిగిపోయాయి.. ఇక గంటలే మిగిలాయి. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకాలం గెలుపు ధీమా వ్యక్తపరిచిన అభ్యర్థుల గుండెలు లబ్‌డబ్‌.. లబ్‌డబ్‌ అంటూ వేగంగా కొట్టుకుంటున్నాయి. బరిలో నిలిచేవారే కాదు.. తమ అనుచరులు పార్టీ కార్యకర్తలదీ అదే పరిస్థితి. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రంలోనూ కూటమికే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించడంతో ఆయా అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్‌ కనిపిస్తోంది. అధికార వైకాపా మాత్రం రెండోసారి మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన భయంతో వణికిపోతున్నారు. కౌంటింగ్‌ రోజు దగ్గర పడడంతో అభ్యర్థులు గుళ్లు, గోపురాల చుట్టే ఎక్కువ తిరుగుతున్నారు. తమ విజయాన్ని కాంక్షిస్తూ ఇష్ట దైవాలకు పూజలు చేసి, మొక్కుకుంటున్నారు.
 
మరోవైపు, కౌంటింగ్‌ ఏజెంట్లు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల్లోగా లెక్కింపు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన ఏజెంట్లు సోమవారం రాత్రికే అనకాపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుని బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. 
 
స్వతంత్ర అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఏజెంట్లు నియమించుకోలేరు.. వారి బదులు కూటమి, వైకాపా వారే కొంతమంది తమ అనుకూల ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వీరందరికి ముందురోజు అనకాపల్లిలో బస చేయడానికి అవసరమైన గదులు బుక్‌ చేశారు. జిల్లా కేంద్రంలో హోటల్‌ గదులు తక్కువగా ఉండడంతో ఫంక్షన్‌హాళ్లు బుక్‌చేసి ఏజెంట్లకు సదుపాయాలు కల్పిస్తున్నారు. అల్లూరి జిల్లాలో కూడా దూర ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయమే చేరుకోలేరు కాబట్టి వారు కూడా ముందు రోజే పాడేరు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.
 
2019 ఎన్నికల్లో అనకాపల్లి, అల్లూరి జిల్లాలోని అన్ని స్థానాలు వైకాపానే కైవసం చేసుకుంది. తాజా ఎన్నికల్లో ఆ ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, నేతల అవినీతి అధికార పార్టీని ఇంటికి పంపించడానికి ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లు కూటమి అభ్యర్థులు చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలూ అలాగే ఉన్నాయి. కూటమి తరఫున ఓ అభ్యర్థిపై రూ. 100 పందెం కడితే వైకాపా తరఫున రూ.50 నుంచి రూ.60 మాత్రమే పందేలు కాయడానికి ముందుకు వస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా అధికార పార్టీ కార్యకర్తలు సాహసించడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం!!