ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణ శివారులో పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో భారీగా తెలంగాణా మద్యం పట్టుబడింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్ ఇ బి అడిషినల్ ఎస్పీ తుహీన్ సీన్హా ఆదేశాల మేరకు గురువారం తెల్లవారు జామున సి ఐ మంజుల, యస్ ఐ రాముడు, సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వైపు నుండి ఫోర్డ్ ఫియేస్ట కారు AP 28 DK 2491 పట్టుబడింది.
కారును ఆపి తనిఖీ చేయగా, అందులో కర్నూల్ పట్టణం ఒబుల్లయ్య నగర్ షరీన్ నగర్ కు చెందిన బండి సురేష్ బాబు (42) తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి 7 బాక్సుల మద్యం కొనుగోలు చేసి కర్నూల్ కు తరలిస్తూ అధికారుల తనిఖీల్లో దొరికాడు. కారులో 108 అక్రమ తెలంగాణ ఫుల్ బాటిళ్లు మద్యం వున్న 7 కాటన్ బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని కర్నూల్ లో అమ్మడానికి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల క్రితం ఇదే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తూ, పంచ లింగాల చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. పట్టుకొన్న మద్యం బాటిళ్లును, కారును సీజ్ చేసి కర్నూల్ పోలీసు స్టేషన్ కు అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖాజా, జగన్నాథం, రంగ స్వామిలు పాల్గొన్నారు.