తనతో కుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగంచాలంటూ ఓ మహిళను ఓ వ్యక్తి ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆ మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా తండూరుకు చెందిన అంజిలమ్మ (40) అనే మహిళతో అగ్గనూరు గ్రామానికి చెందిన నర్సింహులు (45) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, కొన్ని రోజులుగా అంజిలమ్మ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆగ్రహించిన నర్సింహులు.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది.
ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి 11 గంటలకు ఆమెపై కిరోసిస్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. అనంతరం నర్సింహులు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. వారివద్దరికీ తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందుతోందని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఈ రోజు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంజిలమ్మ కుటుంబ సభ్యులపై కూడా నర్సింహులు కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.