నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీలన్నీ కూడా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి వస్తున్నాయి.
ఈనేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరి ఎంటోనన్న సందేహం ప్రతిఒక్కరిలోనూ నెలకొంది. అయితే, బీజేపీ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ప్రకటించింది. తన నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆక్షేపిస్తున్నారు. పైగా, జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక రోజు మౌనదీక్ష చేస్తున్నారు.