మరుగుదొడ్ల ఫొటోలు తీయాల్సిన పని నుంచి ఇకపై ఉపాధ్యాయులకు విముక్తి లభించనుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై మోపిన యాప్‌ల భారం నుంచి కొంత ఉపశమనం లభించింది.
ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నుంచి మరుగుదొడ్ల పరిశుభ్రత వరకూ అన్నీ ఉపాధ్యాయులే చూసుకోవాల్సి వచ్చేది. అంతేకాదు... వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి యాప్‌లలో అప్‌లోడ్ చేయాలి. ఆ ఫొటోలు కూడా ఇలా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెట్టారు. ఇలా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అధికంగా వుండేవి.
ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశామని ఏపీ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు ఊరట నిచ్చే వార్త చెప్పారు. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించామన్నారు.
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ.. "నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం." అంటూ ఉపాధ్యాయులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు.