Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాతృభూమిని మరువని బాపట్ల బిడ్డ... ఐఐటీ ఎంకు రూ.228 కోట్ల విరాళం!!

krishna chivukula

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (17:58 IST)
మాతృభూమిని మరవని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల బిడ్డ కృష్ణ చివుకుల. ఈయన ఐఐటీ మద్రాసుకు​ రూ.228 కోట్ల భారీ విరాళంను ప్రకటించారు. అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్‌ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, మాతృదేశంపై మమకారంతో ఇక్కడి పేద పిల్లలకు విద్యాదానం చేయడంలో ఆది నుంచీ ముందున్నారాయన. తాజాగా తాను ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఐఐటీ నిబంధనల ప్రకారం విరాళాలిచ్చే దాతలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన క్యాంపస్‌లో జరిగే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణ చివుకుల ప్రత్యేకంగా అమెరికా నుంచి చెన్నైకి వస్తున్నారు. 
 
బాపట్ల నుంచి ప్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన డాక్టర్‌ కృష్ణ చివుకుల మధ్య తరగతి విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఐఐటీ బాంబేలో బీటెక్‌ చదివాక, ఐఐటీ మద్రాస్‌లో 1970 నాటికి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు. తుముకూర్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. యూఎస్‌లోని ప్రముఖ హాఫ్‌మన్‌ ఇండస్ట్రీస్‌కి తొలి భారతీయ గ్రూప్‌ ప్రెసిడెంట్, సీఈవోగా సేవలందించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 37 ఏళ్లు. ఆ కంపెనీ నుంచి బయటకొచ్చి న్యూయార్క్‌ కేంద్రంగా ‘శివ టెక్నాలజీస్​'ను నెలకొల్పారు.
 
మాస్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ సాంకేతికతను అందించడంలో ఈ సంస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇదే కంపెనీని బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997లో భారత్‌లో తొలిసారిగా మెటల్‌ ఇంజెక్షన్‌ మౌల్డింగ్‌ (ఎంఐఎం) సాంకేతికతను పరిచయం చేసింది కృష్ణానే. ఆ తర్వాత ‘ఇండో ఎంఐఎం సంస్థను బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఇండో యూఎస్‌ ఎంఐఎం టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నెలకొల్పిన సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో వీరి టర్నోవర్‌ రూ.1000 కోట్లకు పైనే. 2009లో ఆయన తిరుపతి జిల్లా రేణిగుంట కేంద్రంగా గౌరి వెంచర్స్‌ను స్థాపించారు.
 
దాతృత్వంలో మేటి : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఐఐటీ మద్రాస్‌పై కృష్ణ ఎంతో దాతృత్వం చూపిస్తున్నారు. 60 ఏళ్ల నాటి హాస్టళ్లను ఆధునికీకరించడానికి రూ.5.5 కోట్లు వెచ్చించారు. 2014లో ఐఐటీ-ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ రూపొందించేందుకు రూ.1.5 కోట్ల సాయాన్ని అందించారు. క్యాంపస్‌లో స్పేస్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ‘స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌ ప్రోగ్రాం’ పేరుతో విరాళాలు అందిస్తున్నారు. కృష్ణ సేవలకు గుర్తింపుగా 2015లో ఐఐటీ మద్రాస్, 2016లో ఐఐటీ బాంబే ప్రతిష్ఠాత్మక అలుమ్నస్‌ అవార్డు అందజేశాయి.
 
బెంగళూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,200 మంది పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమకూరుస్తున్నారు. బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆసుపత్రిని మెరుగుపరిచి పేద పిల్లల వైద్యానికి సహకారం అందిస్తున్నారు. మైసూర్‌ సమీపంలోని చామరాజనగర్‌లో కృష్ణ దత్తత తీసుకున్న పాఠశాలలో 380 మంది పేద, అనాథ పిల్లలు చదువుకుంటున్నారు. ఐఐటీ మద్రాస్‌లో పరిశోధన వసతుల పెంపునకు తాజాగా ఆయన ప్రకటించిన భారీ విరాళం ఆ విద్యాసంస్థకు వరంగా మారనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలుపై రాయి రువ్విన దుండగుడు.. ప్రయాణీకుడికి గాయం (video)