ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు కారణం వైకాపా సర్కారు వేధింపులేనని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్య దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కోడెలకు ఇబ్బందులు ఎదురైతే చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని.. నాని అన్నారు.
వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించారు. చంద్రబాబుకు ఇంత చేసినా తనను పట్టించుకోలేదని కోడెల మనస్తాపం చెందారు. ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చి కోడెలను చంద్రబాబు పక్కనపెట్టారు. కోడెలకు నర్సరావుపేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లినుంచి పోటీ చేయించారు.
కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌ను చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్లి వాడుకున్నట్టు స్వయంగా కోడెల ప్రకటించారు. వైసీపీ బాధితుల క్యాంపునకు రాకుండా ఎందుకు అడ్డుకున్నారు.
పల్నాడు ప్రాంతంలో ఆందోళనకు పల్నాటి పులిని ఎందుకు అనుమతించలేదని చంద్రబాబుపై నాని ప్రశ్నల వర్షం కురిపించారు. కోడెల పులి అయితే చంద్రబాబు నక్క అంటూ ధ్వజమెత్తారు. నమ్మిన కుటుంబం మోసం చేస్తే, పార్టీ అధినేత పక్కన పెడితేనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. 40 మంది కేసులు పెడితే కోడెల ఆత్మహత్య చేసుకునే పిరికివాడా..? అని ప్రశ్నించారు.
కేసులు పెడితే ఎవరైనా పోరాటం చేస్తారు కానీ నమ్మిన కుటుంబం మోసం చేస్తే, పార్టీ అధినేత పక్కన పెడితేనే కోడెల సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. కోడెలపై కేసులు ప్రభుత్వం పెట్టలేదు.. కోడెల బాధితులే కేసులు పెట్టారని నాని వ్యాఖ్యానించారు.