ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడులపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విగ్రహాలను ధ్వంసం చేసిన వారి చేతులు నరికివేయాలన్నారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వరుసగా హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. చాలా కిరాతకమన్నారు. ఈ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటలను పూర్తిగా ఖండించమేకాదు.. విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు.
ఇప్పటివరకు సుమారు రాష్ట్రంలోని 127 గుళ్లపై అనేక రకాల దాడులు జరిగాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో రథంపై మూడు వెండి సింహాలు మాయమయ్యాయని, దానిపై ప్రభుత్వం పట్టించుకోలేదని, అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఆ తర్వాత పేకాటపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం సరికాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. 'రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయం, చట్టం అంటే లెక్కలేనితనం. ఎవడికైనా చెబుతున్నా.. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఉత్తుత్తినే నోరు పారేసుకోవద్దు. మేము మాటల మనుషులంకాదు. అవసరమైతే చేతలను కూడా చూపిస్తాం. జాగ్రత్త.. తస్మాత్!' అంటూ మంత్రి కొడాలి నానికి బాలకృష్ణ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు.
ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. ఒకసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో యువత, రైతులు, కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.