Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేరం వేరు.. పాపం వేరు - అచ్చెన్న కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నేరం వేరు.. పాపం వేరు - అచ్చెన్న కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
, బుధవారం, 8 జులై 2020 (20:17 IST)
ఈఎస్‌ఐ మందుల కొనుగోలు అవకతవకల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. అచ్చెన్నాయుడిని గుంటూరులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతినిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
 
విజయవాడ లేదా గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా ఒక ఆసుపత్రికి తరలించాలన్న అంశంపై వాదనలు కొనసాగగా, చివరకు కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అరెస్టయిన అచ్చెన్నాయుడును ఏ ఆసుపత్రికి తరలించాలన్న విషయంపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. అయితే, ఆ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 
 
హైకోర్టు ఆదేశాలతో విజయవాడ సబ్ జైలులో ఉన్న అచ్చెన్నాయుడ్ని గుంటూరులోని రమేశ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఈఎస్ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
 
అయితే అప్పటికే ఆయనకు మొలలుకు ఆపరేషన్ జరగడంతో ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఏసీబీ అధికారులు సైతం అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే విచారించారు. 
 
అపై ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాను ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అచ్చెన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రక్తస్రావం జరుగుతున్నా.. 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించారని, దర్యాప్తు అధికారి వ్యవహరించిన తీరు... అంతరాత్మ ఉన్న ఏ మనిషినైనా కదిలిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించారు. చికిత్స జరిగినట్లు తెలియదన్న వాదన నమ్మశక్యంగా లేదని కోర్టు తెలిపింది. 
 
కంటికి కన్ను, పంటికి పన్ను... అనే సిద్ధాంతం నుంచి... సమాజం చాలా దూరం వెళ్లిందనే విషయం గుర్తించకపోవడం దురదృష్టకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నేరం వేరు, పాపం వేరు... నేరం చేసిన వారికి హక్కులు లేవన్న వాదన సమర్ధనీయం కాదని కోర్టు తప్పుబట్టింది. తీవ్రమైన నేరం చేసిన వారికి కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఉంటాయని కోర్టు తెలిపింది. 
 
సుదూర ప్రయాణం చేయించడం వల్ల రెండో చికిత్స చేయాల్సి వచ్చిందని, అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై స్పెషల్ జడ్జి దృష్టికి తీసుకువచ్చి... ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే జిల్లా జైలుకు తరలించాలని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ కేసులో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, జూన్ 23, 24 తేదీలలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు విడుదల చేసిన బులెటిన్, రాసిన లేఖలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు లేఖలు చూస్తే పిటిషనర్‌ను ఎలా ట్రీట్ చేశారో తెలిసిపోతుందని, కొలనోస్కోప్ చేసిన తర్వాత బయాప్సి నివేదిక రాకుండానే... అచ్చెన్నాయుడిని ఎందుకు డిశ్చార్జి చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం : 10 మందికి పాజిటివ్