అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలింపు ప్రక్రియపై ఏపీ మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు ప్రక్రియ సాధ్యపడక పోవచ్చని వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. జూలై నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం వెనుక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తముందని ఆయన ఆరోపించారు. చంద్రబాబే రఘురామకృష్ణంరాజుతో మాట్లాడిస్తున్న విషయం అందరికీ తెలుసని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ల్యాటరైట్ గనుల్లో వైసీపీ నేతలు దోచుకున్నారన్నది అసత్యమన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. సరస్వతి పవర్ అంశంలో నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.