తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే తన తండ్రి ఆస్తితో పాటు.. తన పేరిట ఉన్న ఆస్తిని పేదలకు రాసిస్తానని టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. అయితే, తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. చింతమనేనిని బుధవారం ఏపీ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు.
ఈ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ, తనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతి మనిషికీ ఒక నీతి అనేది ఉంటుందని... కానీ, ఏ ధర్మం ప్రకారం పోలీసులు తనపై ఇన్ని అక్రమ కేసులను పెట్టారని నిలదీశారు. ఎందుకు తనను అరెస్టు చేయాలనుకుంటున్నారని అడిగారు. తన మనుషులను, తన కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు.
తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువలను కూడా పోలీసులు ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఇన్ని రోజులు తాను బయటకు రాలేదని... తన పనేదో తాను చేసుకుంటున్నానని... కానీ తనను రెచ్చగొట్టారని... ఏ విచారణకైనా తాను సిద్ధమని చింతమనేని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు తాను వస్తే అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు.