Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద మృతులకు టిడిపి ఆపన్నహస్తం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష

వరద మృతులకు టిడిపి ఆపన్నహస్తం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష
, గురువారం, 25 నవంబరు 2021 (18:33 IST)
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. వరద బాధితుల కష్టాలను చూసి చలించినపోయిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

 
చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వరదల కారణంగా మృతి చెందిన 60 కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తాము చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వెంటనే అందజేస్తామన్నారు.

 
అలాగే కడప జిల్లాలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు చంద్రబాబు. అలాగే ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుపైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబునాయుడు.

 
భారీ వర్షాలు పడుతున్నాయని తెలిసినా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు చంద్రబాబు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు. గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. లక్ష్మీపురం సర్కిల్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు ఆచూకీ ఇప్పటివరకు లభించకపోవడం బాధాకరమన్నారు. 

 
కడప జిల్లాలో ఆరు గ్రామాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయని.. రాయలచెరువులోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రకృతిలో ఆడుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాలన్నారు.

 
అలాగే తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలని.. కపిలతీర్థం నుంచే వచ్చే నీటిని స్వర్ణముఖిలోకి తరలించడానికి ఒక కెనాల్‌ను త్రవ్వాలన్నారు. వరదల్లో చనిపోయిన 60 మందివి హత్యలేనని.. వారికి ఒక్కో కుటుంబానికి పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 
వరి, చెరుకు, పత్తి, వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, మామిడిలకు పరిహారం పెంచాలన్నారు. రంగులు వేయడానికి 6 వేల కోట్ల రూపాయలు అనవసర ఖర్చు చేశారని.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను సక్రమంగా ఖర్చు పెట్టాలన్నారు. మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 

 
త్వరలో వరద బీభత్సంపై ఎపి సిఎస్‌కు లేఖ రాస్తానన్నారు చంద్రబాబు. వరద బాధితులను ఆదుకునేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. తిత్లి, హుద్‌హుద్ తుఫాన్ సమయంలో బాధితులను అప్పటి టిడిపి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని చంద్రబాబు గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చొక్కా విప్పి పనిచేసిన ఎమ్మెల్యే, హమాలీగా మారి వరద బాధితుల కోసం...