ఈ రాష్ట్ర సంపదను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని, రాజధాని కోసం పోరాడే మహిళలపై కొందరు మంత్రుల కామెంట్స్ చూస్తే, వారికి మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అమరావతి రైతులది చారిత్రాత్మక పాద యాత్ర అని, రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్ర అని అభివర్ణించారు.
వైసీపీ నాయకులను ఆ భగవంతుడు కూడా క్షమించడన్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అమరావతి రైతు మహా పాదయాత్రలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగే అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాతంత్రం కోసం శాంతి పోరాటం ఎలా సాగిందో, అదే తరహాలో మరో పోరాటం జరుగుతోందని చెప్పారు. విరామం లేకుండా 700 కిలోమీటర్లకు పైగా పట్టుదలతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు పాద యాత్రను కొనసాగిస్తున్నారని సోమిరెడ్డి, పోలంరెడ్డి కొనియాడారు.
రాష్ట్రానికి కేంద్ర బిందువైన అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా రాజధానిగా ఏర్పాటు చేశారని అన్నారు. అమరావతిలో కట్టిన భవనాలను శిథిలాలుగా చూడాలన్నది ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి కోరిక అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో లక్షల మందికి కట్టిన టిడ్కో ఇళ్లల్లో పేదల ఉండకూడదా అని వారు ప్రశ్నించారు. అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టిన నిర్మాణాలు శిథిలాలు అయిపోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి కోసమో పక్షపాతంగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయలేదని, సెంటర్ ఆఫ్ ది ప్లేస్ గా 13 జిల్లాలకు అనువుగా ఏర్పాటు చేశారని చెప్పారు.
శాసనసభలో మద్దతు పలికి, ప్రధాని చేత శంకుస్థాపన చేసి, చట్టప్రకారం చేసిన రాజధానికి ఏర్పాటుకు ప్రభుత్వం అడ్డం తిరగడం దుర్మార్గమని అన్నారు. స్వాతంత్ర ఉద్యమాలు పుస్తకాల్లోనే చదివాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాజధాని కోసం వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ప్రభుత్వం ఇంతకు ఇంత అనుభవించక తప్పదన్నారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకొని ప్రవర్తిస్తోందని, అన్ని పార్టీలు, ఐదు కోట్ల మంది ఆంధ్రులు అమరావతిని రాజధానిగా మద్దతు తెలిపినా వైసీపీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోందన్నారు.
మాటతప్పం మడమ తిప్పం అని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, నిండు అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు అడ్డం తిరగడం కరెక్ట్ కాదన్నారు. భవనాలు కూల్చడం, జనాలపై తప్పుడు కేసులు పెట్టి లోపల వేయటం, ఇది వైసీపీ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలన అని విమర్శించారు.