Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిబి నియంత్రణ లక్ష్య సాధనే మనందరి ధ్యేయం: గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్

టిబి నియంత్రణ లక్ష్య సాధనే మనందరి ధ్యేయం: గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (19:29 IST)
భయంకరమైన క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా కలిసి పనిచేయవలసి ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా క్షయవ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం క్షయవ్యాధిని ప్రపంచ అత్యవసర స్ధితిగా ప్రకటించిందని గవర్నర్ గుర్తు చేసారు. 70వ “టిబి సీల్ సేల్ క్యాంపెయిన్”ను గౌరవ గవర్నర్ శుక్రవారం ప్రారంభించారు. రాజ్ భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా టిబి అసోసియేషన్ ప్రతినిధులు, టిబి నియంత్రణకు సహకరిస్తున్న స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
 
ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ క్షయకు కారణమైన జీవిని రాబర్ట్ కోచ్ 1882 సంవత్సరంలో కనుగొన్నప్పటికీ, 137 సంవత్సరాలుగా టిబి ప్రాణాంతక వ్యాధిగా కొనసాగటం ఆందోళన కరమన్నారు. 2018లో 21.5 లక్షల టిబి కేసులు నమోదు కాగా, 2017 లో నమోదైన 18 లక్షల కేసులతో పోలిస్తే ఇది 17 శాతం పెరిగిందన్నారు.

1985 వరకు టిబికి చికిత్స వ్యవధి 12 నుండి 18 నెలలు ఉండగా, 1996లో రివైజ్డ్ నేషనల్ టిబి కంట్రోల్ ప్రోగ్రాం (ఆర్‌ఎన్‌టిసిపి) ప్రవేశపెట్టడంతో చికిత్స వ్యవధి 6 నుండి 8 నెలలకు తగ్గిందని గవర్నర్ వివరించారు. జాతీయ టిబి నియంత్రణ కార్యక్రమాన్ని 1997 నుండి రాష్ట్రంలో అమలు చేయగా, 2004 నాటికి అన్ని జిల్లాలు దీని పరిధిలో వచ్చాయని, రాష్ట్రంలో 91.7శాతం మేర ఈ కార్యక్రమం విజయవంతం కావటం సంతోషకరమని హరిచందన్ పేర్కొన్నారు.
 
టిబి నియంత్రణతో పాటు ఏ ఆరోగ్య కార్యక్రమానికైనా, ప్రభుత్వమే వంద శాతం న్యాయం చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమేనని, టిబి అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్‌క్రాస్, లెప్రా ఇండియా, టిబి అలర్ట్, వరల్డ్ విజన్, ఎఎమ్‌జి ఇండియా ఇంటర్నేషనల్, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ వంటి స్వచ్ఛంద సంస్థలు దేశంలో క్షయ నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించటం ముదావహమన్నారు.

రాష్ట్రంలోని క్షయ సంఘాలు, వాటి జిల్లా శాఖలు టిబి నియంత్రణ కోసం తమ వంతు కృషి చేస్తున్నాయని, జాతీయ టిబి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య విద్యను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటును అందించటం స్పూర్తి దాయకమని గవర్నర్ అన్నారు.
 
మరోవైపు కొత్త టిబి కేసులను గుర్తించడం కోసం అసోసియేషన్ వ్యాధి నిర్ధారిత క్యాంప్‌లతో పాటు, టిబి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తూ, పూర్తిస్థాయిలో చికిత్సతో వ్యాధి నుండి నయం అయిన రోగులకు ప్రోత్సాహకాలు పంపిణీ చేయటం ద్వారా, ఇతర టిబి రోగులను క్రమం తప్పకుండా చికిత్స పొందేలా ప్రోత్సహించటం మంచి పరిణామమన్నారు. 2025 నాటికి టిబి వ్యాధి వ్యాప్తిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని  ఆక్రమలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య విభాగాలు, ఆంధ్రప్రదేశ్ టిబి అసోసియేషన్లు, వారి జిల్లా శాఖల మరింతగా కృషి చేయాలని గవర్నర్ స్పష్టం చేసారు. ఇందుకు ప్రతి ఒక్కరూ ఉదారంగా సహకరించాలని హరిచందన్ విన్నవించారు.
 
కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ సంచాలకులు డాక్టర్ బి వెస్లీ, అచార్య కె. సుధాకర్, అసోసియేషన్ గౌరవ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, ఎఎంజి ఇండియా ఇంటర్నేషనల్ సంచాలకులు డాక్టర్ ఎకెకె మెహంతి, టిబి అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎ బేగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిబి సీల్ అమ్మకం ద్వారా గణనీయమైన మొత్తాలను సేకరించిన సంస్ధల ప్రతినిధులకు గవర్నర్ మెమొంటోలను అందచేసి సత్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫైర్, ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన రాములమ్మ