ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం స్టే

గురువారం, 16 జనవరి 2020 (07:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50 శాతం మించకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్‌రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 176 పై స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లోగా దాఖలైన పిటిషన్ విచారణ పూర్తిచేయాలని హైకోర్టుని ఆదేశించింది.

రిజర్వేషన్లు 50శాతం మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధనను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని పిటిషన్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50శాతం దాటినా ఏపీ హైకోర్ట్ స్టే ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని, ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు లేవు కాబట్టి తీర్పుకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రష్యా ప్రధాని రాజీనామా