ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆయన చేసిన ఫిర్యాదును సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టేసింది. ఏపీలోని న్యాయ వ్యవస్థను ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు జగన్ ఫిర్యాదు చేశారు.
2020 అక్టోబర్ 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిందని... అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత జగన్ ఫిర్యాదును తోసిపుచ్చడం జరిగిందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైటులో ఈరోజు సమాచారాన్ని ఉంచారు. అయితే ఇన్ హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని, దీనికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించతగినవి కాదని ఆ ప్రకటనలో తెలిపారు.
మరోవైపు చీఫ్ జస్టిస్ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా ఎన్వీ రమణను నియమించాలని కేంద్రానికి ఆయన ఈరోజు సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న సుప్రీం చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేస్తారు.