మారటోరియం కాలాన్ని పొడగించమని కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం కుదరదన్నారు.
గత యేడాది కొవిడ్ కారణంగా ప్రకటించిన రుణ మారటోరియం కాలంలో తీసుకున్న చిన్న రుణాలపై ఎలాంటి చక్రవడ్డీ వసూలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే వసూలు చేసేస్తే ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది.
ఈ విషయంపై గతంలోనే వాదనలు ఆలకించి-తన మనోగతాన్ని సంకేతప్రాయంగా వెల్లడించిన కోర్టు తన తీర్పును డిసెంబరు 27న వాయిదా వేసింది. మారటోరియం కాలానికి మొత్తం రుణాన్ని మాఫీ చేసేట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్లను తాజాగా వెలువరించిన తుది తీర్పులో తిరస్కరించింది.
మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా కొవిడ్ ఉధృతంగా ఉన్న కాలానికి రెండు కోట్ల రూపాయల దాకా ఉన్న రుణాలపై వడ్డీకి వడ్డీని వసూలు చేయబోమని ప్రభుత్వం, ఆర్‌బీఐ ప్రకటించాయి. ఈ కాలాన్ని పొడిగించాలంటూ కొన్ని కార్పొరేట్ సంస్థలు, వాణిజ్య సంఘాలు పిటిషన్ వేశాయి. దీన్ని కోర్టు కొట్టేసింది.
మారటోరియం కాలాన్ని పొడిగించమని కోరలేమని, ఆర్థికపరమైన విధాన నిర్ణయంలో కోర్టుల జోక్యం కుదరదని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పులో పేర్కొంది.