Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బాయ్ రమణా... అని ఊళ్ళో పెద్దలు పలకరించ‌డం ఓ పుల‌కింత‌!

Advertiesment
supreme court cheif justice n.v.ramana
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:20 IST)
త‌న సొంత ఊరిలో, త‌న సొంత రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌ట‌న త‌న‌కెంతో ఆనందం క‌లిగించింద‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తెలిపారు. అంద‌రికీ వందనం-అభివందనం అంటూ, బహిరంగ లేఖ రాశారు. 
 
 
ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఒకసారి మా ఊరు పౌన్నవరం వెళ్ళి రావాలని. అయినవాళ్ళందరినీ పలకరించి రావాలని. సుప్రీం కోర్టుకు శీతాకాలం సెలవులు ప్రకటించడంతో నా ఆలోచన అమల్లో పెట్టే అవకాశం దొరికింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి. ఈ నెల 24 వ తేదీ ఉదయం ఎంతో ఉత్సుకతతో స్వగ్రామానికి సకుటుంబ సమేతంగా బయలుదేరాను. 
 
 
గరికపాడు దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలు మోపింది లగాయతు. ఆంధ్ర ప్రజలు అసంఖ్యాకంగా బారులు తీరి, స్వాగత వచనాలతో, నినాదాలతో, పూల వానతో, అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరు నేనూ, నా కుటుంబ సభ్యులూ ఎప్పటికీ మరువజాలం. బంధుత్వాల కంటే మిత్రబంధానికే పెద్ద పీట వేసే పొన్నవరం ఊరు ఊరంతా తరలివచ్చి, నన్ను, నా కుటుంబ సభ్యులను ఎడ్ల బండెక్కించి, పాలిమేరలనుండే ఊరేగింపుగా తోడ్కొని పోయిన వైనం నన్ను కదిలించింది. 
 
 
మూలాలు మరువరాదని బలంగా విశ్వసించే నేను, మా ఇద్దరు కుమార్తెలకు మరోసారి, ఇద్దరు అల్లుళ్లకు ఇద్దరు చిన్నారి మనుమరాళ్ళకు తొలిసారి నా ఊరు చూపించగలగడం ఎంతో సంతృప్తినిచ్చింది.  పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు తరుముకొచ్చాయి. ఆప్తులు ఎందరో చాలా కాలం తర్వాత కలిశారు.  భావోద్వేగం కట్టలు తెంచుకుంది... అని జ‌స్టిస్ ర‌మ‌ణ పేర్కొన్నారు.
 
 
"అబ్బాయ్ రమణా" అని ఊళ్ళో పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది. అన్నీ గౌరవాలూ ఆశీర్వచన భరిత పలకరింపు ముందు దిగదుడుపే. నా ఊరి ప్రయాణం వార్త బయటకు పొక్కగానే, ఎన్నో ఆహ్వానాలందాయి. అందులో కొన్ని మాత్రమే ఆమోదించగలిగాను. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయ మూర్తి హోదాలో రాజధాని ప్రాంతంలో నా తొలి పర్యటన పురస్కరించుకుని ఆతిథ్యమిచ్చారు. వారికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ, తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు జ‌స్టిస్ ర‌మ‌ణ‌. 
 
 
సకల జీవన రంగాలకు చెందిన వారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ, సామాజిక పక్షాల ప్రతినిధులు ఎందరో నన్ను పలకరించేందుకు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నాకు నడక నేర్చిన 'బెజవాడ బార్ ఎసోసియేషన్', ఇంకా 'ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు బార్ ఎసోసియేషన్', 'ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్', 'ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఉద్యోగుల సంఘం', 'రోటరీ క్లబ్ విజయవాడ ' అతి స్వల్ప వ్యవధిలో, అసాధారణమైన ఏర్పాట్లతో, నన్నూ, నా సతీమణి శివమాలనూ సత్కారాలతో ముంచెత్తాయి. కొందరు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుండి తరలి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమించిన ఈ సంస్థలకు, వ్యక్తులకు పేరు పేరునా కృతజ్ఞతలు. 
 


లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాసమివ్వడానికి నన్ను ఎంపిక చేసిన సిద్ధార్థ న్యాయ కళాశాలకు, కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ హై కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల పట్ల మీరు చూపిన గౌరవం, అభిమానం శ్లాఘనీయం. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయ మూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవం చూసి వారెంతో సంతోషించారు. నా నుండి ఏమీ ఆశించకుండా, స్వంత పనులన్నీ మానుకొని, ఎండకూ వేడికీ వెరవక, నేను ప్రయాణించిన మార్గంలో గంటల తరబడి వేచి ఉండి, అడుగడుగునా దీవించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్సులు. మీరు చూపిన అభిమానాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయనని మాట ఇస్తున్నాను అని ర‌మ‌ణ పేర్కొన్నారు.
 
 
భవ్య దర్శన భాగ్యం కల్పించిన విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, పొన్నూరు  వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, చందోలు బగళాముఖీ అమ్మవారి దేవస్థానం, ఇంకా మా వూరి ఆలయాల పాలక మండళ్లకు హృదయ పూర్వక ధన్య వాదాలు. క్రిస్మస్ పర్వదినం నాడు ఆశీర్వాదాలు అందించిన క్రైస్తవ మత పెద్దలకు కృతజ్ఞతలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అడుగిడింది మొదలు మా బాగోగులు చూసుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రోటోకాల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రాజ్ భవన్ అధికారులకు, యావత్తు అధికార యంత్రాంగానికి మా అందరి తరపున కృతజ్ఞతలు. మా పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు.  పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జ‌స్టిస్ వెంక‌ట ర‌మ‌ణ‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం