ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పర్యటిస్తున్నట్లు చెప్పారు.
మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పెట్రోలింగ్ జరుగుతోందని తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తాం అన్నారు.
రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ ఇస్తామని, సామాజిక మాధ్యమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపి వెల్లడించారు.