ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గడంతో, సోమవారం ఉదయం వరకూ తెరచుకుని ఉన్న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. నిన్నటివరకూ 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా, 10 గేట్లను తెరచిన అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 5 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు.
ఎగువ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్న కారణంగా గేట్లను మూసివేసినట్టు తెలిపారు. వస్తున్న నీటిలో కొంతభాగాన్ని రిజర్వాయర్‌ను నింపేందుకు, ఇతర కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా తరలింపునకు వాడుతున్నామని వెల్లడించారు.
కాగా, 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉండే రిజర్వాయర్ లో ప్రస్తుతం 882.70 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇది 202.96 టీఎంసీలకు సమానం. ఇదిలావుండగా, సాగర్ నుంచి వచ్చే నీటిని బట్టి, గేట్ల మూసివేతపై నేటి సాయంత్రం లేదా రేపు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.