తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. బయటకి పోవాలంటే జడుసుకుంటున్నారు. జూన్ మాసం రాగానే సహజంగా వాతావరణం చల్లబడుతుంది. కానీ ఇప్పుడలా లేదు. ఇంకా భానుడు భగభగమంటూ మంటలు కురిపిస్తున్నాడు. దీనితో చల్లగా చినుకులు ఎప్పుడు పడతాయోనని ఎదురుచూసేవారికి భారత వాతావరణ శాఖ కబురు చెప్పింది.
జూన్ నెల 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు వారం రోజులు ఆలస్యమయ్యాయని తెలిపింది. ఐతే రుతుపవనాలు ఈ నెల 8న కేరళను తాకే అవకాశాలున్నాయనీ, అవి ఉత్తరంవైపుగా పయనించి దేశంపై విస్తరిస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు మరో నాలుగైదు రోజులు ఆగాల్సిందే మరి.