ఓ పోకిరి చేష్టలకు ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. అమ్మా అని పిలుస్తూనే అలా చేశాడనీ ఆమె జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కంచిలి గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తి ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. గతంలో కంచిలిలో పనిచేసినప్పుడు భారతీయ స్టేట్ బ్యాంకు సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ వచ్చాడు. అదే ఇంటి కింది పోర్షన్‌లో ఏపీజీవీ బ్యాంక్ ఉండేది. అక్కడ పనిచేస్తున్న దంపతులతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉండేవాడు. వారిద్దరినీ మమ్మీడాడీ అని పిలుస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో ఆ మహిళ ఓసారి స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. అనంతరం దాన్ని చూపించి ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. అయినా ఆమె అతనికి చిక్కలేదు. ఈలోగా మాధవ్‌కు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాడు. అప్పటికీ వేధింపులు మానుకోలేదు.
వారం రోజుల క్రితం కంచిలి వచ్చిన మాధవ్ సదరు వివాహితను మళ్లీ బెదిరించాడు. దీంతో విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారంతా మాధవ్‌ను మందలిద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఏం జరిగిందో సదరు వివాహిత గురువారం అర్థరాత్రి బలవన్మరణానికి పాల్పడింది.
చనిపోతూ మాధవ్ చేష్టలను, అతనికి సహకరించిన మరో ఇద్దరి తీరును తెలియజేస్తూ సూసైడ్ నోట్ రాసింది. కుమార్తె మరణ సమాచారం అందడంతో ఒడిశాలో ఉన్న ఆమె తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.