Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కక్ష సాధింపులను ఎదుర్కొనే సత్తా మాకుంది.. సోమిరెడ్డి

Advertiesment
కక్ష సాధింపులను ఎదుర్కొనే సత్తా మాకుంది.. సోమిరెడ్డి
, శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:55 IST)
కక్ష సాధింపులను ఎదుర్కొనే సత్తా తమకుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని ఆదిత్యనగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..

"కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో క్రిష్ణా, గోదావరి నదుల రిజర్వాయర్లలోకి మరోసారి భారీగా వరద వస్తోంది. చెన్నైతో పాటు రాయలసీమ, నెల్లూరు అవసరాలకు క్రిష్ణా జలాల పర్యవేక్షణ కమిటీ పదిరోజుల క్రితం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిధికి 88 టీఎంసీలు కేటాయించింది.

ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ కు 2.22 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది...ఈ వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ కేటాయింపులు జరుగుతాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు డ్రా చేసుకునే అవకాశం ఉంది. లక్షల క్యూసెక్కుల వరద ఉన్నప్పటికీ 24 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేస్తున్నారు. ఫలితంగా రోజుకు ఒక టీఎంసీకి పైగా జలాలను కోల్పోతున్నాం.
 
గత ఏడాది క్రిష్ణా నది పరివాహక ప్రాంతంలో చుక్క వర్షం పడకపోయినా సోమశిలకు 48.5 టీఎంసీలు తీసుకొచ్చాం. సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో ఈ ఏడాది మొదటి పంట పూర్తి విస్తీర్ణంలో పండించుకునే అవకాశం ఉంది. సోమశిల 26.95 టీఎంసీలకు చేరుకుంది.

డెడ్ స్టోరేజీలో ఉన్న కండలేరుకు ఇప్పుడే విడుదల ప్రారంభించి 8 టీఎంసీలకు చేరిన వెంటనే కండలేరు-పూండి కాలువ ఫంక్షనింగ్ ప్రారంభించాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో తాగునీటితో పాటు సాగునీరు కూడా అందించవచ్చు.
 
ఇరిగేషన్ మంత్రి, అధికారులు వెంటనే కలెక్టర్ తో పరిస్థితులను చర్చించి కండలేరుకు నీటి విడుదలకు చర్యలు చేపట్టాలి. కనీసం రోజుకు ఐదారు వేల క్యూసెక్కులు ఇప్పటి నుంచే కండలేరుకు విడుదల చేయాలి. కండలేరుకు నీటి విడుదలను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో ఇరిగేషన్ మంత్రి, అధికారులు ఆలోచించుకోవాలి.

ఐఏబీ సమావేశం వరకు నీటి విడుదల విషయంలో తాత్సారం తగదు. మా ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చాం..లోడింగ్, రవాణా చార్జీలు కలిపి నెల్లూరు నగరంలో ట్రాక్టర్ ఇసుక 1000, 1100 రూపాయలకే ఇళ్లకు చేరేది. ఇప్పుడు ఐదు నెలలు సమయం తీసుకుని టన్ను ఇసుక రూ.375గా నిర్ణయించారు.

ట్రాక్టర్ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.2,300 నుంచి రూ.2,500 అయింది. పాత ప్రభుత్వం కంటే మంచి పాలసీ తీసుకొస్తామని వెయ్యి రూపాయలున్న ట్రాక్టర్ ఇసుకను 2500కి పెంచారు. ఇసుక లేక అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయి వేలాది మంది కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రభుత్వాలు మారితే పరిపాలన ఆగిపోదు..విధానాల్లో మార్పులు మాత్రమే చేసుకోవచ్చు. టీడీపీ అధికారం చేపట్టినప్పుడు గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు అదనంగా చేశాం కానీ రద్దులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. మీ ప్రభుత్వ తీరు మీకు ఓట్లు వేసిన వారితో పాటు మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా నచ్చడం లేదనే విషయం గమనించండి.

మా మీద ఎన్ని కేసులైనా పెట్టండి. మీ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొనే సత్తా నాయకులుగా మాకుంది. గ్రామాల్లో చిన్న స్థాయి కార్యకర్తలపై మీ ప్రతాపం చూపించొద్దు. టీడీపీ కార్యకర్తలపై ఎలా దాడులు చేయాలనేది కాదు...వృధాగా పోతున్న జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూడండి. పరిపాలనపై దృష్టి పెట్టండి.

నాలుగేళ్లలో సగటున 10.5 శాతం వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11.2 శాతం వృద్ధి రేటుతో మీ చేతికి పాలన అప్పగించాం. ఇప్పుడు వృద్ధి రేటు రోజురోజుకు పడిపోతోంది. హంద్రీనీవా ఆగిపోవాలి,రాజధాని ఆగిపోవాలి, పోలవరం ఆగిపోవాలి అనే వ్యతిరేక ధోరణి తగదు. ప్రజలను వేధించేందుకు కాదు మీకు అధికారం ఇచ్చింది.

నాపై అయితే కేసులు లేవు..వారిపై కేసులున్నాయి కాబట్టి నన్నూ ముద్దాయిగా మార్చాలని వారి ప్రయత్నం. నేరుగా పెట్టేందుకు ఏమీ లేవు. పెండింగ్ లో ఉన్న సివిల్ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా కేసు పెట్టించారు. ఏం కాదు న్యాయ స్థానాలే చూసుకుంటాయి. జిల్లాలో ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఇళ్లు కూల్చడానికి, రొయ్యల గుంతలు ధ్వంసం చేయడానికి వందల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే పోలీసులు వెళుతున్నారా, లేక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అధికారులు తమ పరిపాలన దక్షతతో అందరికీ రోల్ మోడల్ గా నిలవాలని కోరుకుంటున్నా. కాలేజీ రోజుల నుంచి రాజకీయాలను చూస్తున్నా.

ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. జిల్లాలో మరీ ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఈ పరిస్థితులను సమీక్షించుకుని సరిదిద్దుకోవాలని హితవు పలుకుతున్నా" అని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెదనాన్నఇంట్లోనే చోరీ