Publish Date: Tue, 19 May 2026 (13:27 IST)
Updated Date: Tue, 19 May 2026 (13:40 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో సోమవారం భక్తులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వరస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ శ్వేత నాగు ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంతంలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు, భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
ముఖ్యంగా వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు భయపడుతున్న సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత జాగ్రత్తగా ఆ భారీ శ్వేత నాగును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
అలాగే భీమేశ్వర ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో దూరిన నాగుపాము, ఎండవేడికి తాళలేక బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ జగదీష్ సమయస్ఫూర్తితో దాని పడగపై నీరు పోసి చల్లబరచడంతో పాము శాంతించింది. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.