Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం... భారీ వర్షాలు... స్కూల్స్‌కు సెలవులు

Advertiesment
low pressure

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:01 IST)
ఉత్తారంధ్రను తీవ్ర వాయుగుండం వణికిస్తుంది. ఈ కారణంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాటు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
 
విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, తీవ్ర వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బలహీనపడుతున్నప్పటికీ, దీని ప్రభావం ఇంకా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. రానున్న గంటల్లో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
 
ఒడిశాలో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరు వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ వంటి నదుల్లోకి చేరుతోంది. దీంతో వంశధార నదిపై ఉన్న హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా, నారాయణపురం ఆనకట్ట వద్ద కూడా నాగావళి నదిలో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు.
 
ఇదిలావుంటే, భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది.
 
గత కొన్ని గంటలుగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా వంశధార నది పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10 మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు ప్రకటించిన మండలాల్లో నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట ఉన్నాయని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా మండలాల ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి త్రిష, సీఎం స్టాలిన్ నివాసాలకు బాంబు బెదిరింపులు