Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి త్రిష, సీఎం స్టాలిన్ నివాసాలకు బాంబు బెదిరింపులు

Advertiesment
stalin - trisha

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (09:52 IST)
సినీ నటి త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసాలతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. 
 
సీఎం స్టాలిన్, నటి త్రిషతో సహా పలువురు ప్రముఖులే లక్ష్యంగా ఆగంతుకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
 
సీఎం ఎంకే స్టాలిన్ ఆళ్వార్‌పేటలోని నివాసం, నటి త్రిష తేనాంపేటలోని ఇల్లు, టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా రాజభవన్ (గవర్నర్ నివాసం), నటుడు, రాజకీయ నాయకుడు ఎస్వీ శేఖర్ ఇళ్లను కూడా పేల్చివేస్తామని హెచ్చరించారు. 
 
ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చేరుకున్న భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇవన్నీ బూటకపు బెదిరింపులేనని నిర్ధారించి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
తమిళనాడులో కొంతకాలంగా ఇలాంటి బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నీలంకరైలోని నివాసానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక నటుడు ఎస్వీ శేఖర్‌కు గత వారమే ఓసారి బెదిరింపు రాగా, తాజాగా మరోసారి హెచ్చరికలు పంపడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IndiGo: చైనాకు విమాన సేవలు పునః ప్రారంభం