ఊరికి సర్పంచి అంటే, పంచె కట్టుకుని, లాల్చీ వేసి, దానిపై కండువా వేసి దర్జా అనుభవించడం కాదు... పెదరాయుడిలా ఫోజులు కొడుతూ, గ్రామం అంతా కలియ తిరగడం కాదు. సర్పంచి అంటే, ఆ ఊరి జనం బాధ్యత. ఆ ఊరి సమస్యల బరువు. ఇలా అర్ధం చేసుకున్న నేతలు ఈ రోజుల్లో కరువు. అలాంటి బేషజాలు లేని ఓ ఊరి సర్పంచి ఉదంతం ఇది. ఊరి పని కోసం కూలీగా మారిన నాయకుడి కథ ఇది.
నేడు గ్రామ సర్పంచ్ గిరి అంటే హంగు ఆర్భాటం. వాటిని పటా పంచల్ చేస్తూ, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామంలో ప్రజా సమస్యలు తీర్చడం కోసం కూలీగా మారాడు. సర్పంచ్ షేక్ నాగూర్ స్వయంగా పార పట్టి రోడ్డు రిపేరు చేశాడు.
గన్నవరం - ఉంగుటూరు అర్ అండ్ బీ రహదారి మధ్య నాగవరప్పాడు గ్రామం ఉంది. టిప్పర్లు, పెద్ద లారీలు ఎక్కువగా తిరగటం కారణంగా, గ్రామం మలుపు వద్ద పెద్ద గుంత ఏర్పడింది. దించో ద్విచక్రవాహన దారులు గుంతలో పడి ఇబ్బందులు పడుతున్నారు. పలువురు అధికారులు దృష్టికి తీసుకు వెళ్లారు. కానీ, ఫలితం లేదు. టిప్పర్లు లారీ డ్రైవర్లును కొంత మట్టి తీసుకువచ్చి గుంతలను పూడ్చమని పలుమార్లు చెప్పినా వారూ స్పందించలేదు.
దీనితో తానే స్వయంగా రంగంలోకి దిగిన సర్పంచి రోడ్ల పై ఇళ్ల దగ్గర వద్ద నిల్వ ఉంచిన కంకర, ఇసుక కొద్దికొద్దిగా డిప్పల ద్వారా మోసుకొచ్చి గుంతను పూడ్చారు. స్వయంగా పార పట్టి, రోడ్డు మరమ్మతు పని చేశారు. సర్పంచులు అంటే హుందాతనం, పెద్ద హోదాగా భావించే ఈ రోజుల్లో నాగవరప్పాడు సర్పంచ్ షేక్ నాగూర్ ఓ సామాన్యు కూలీగా మారి రోడ్డును పూడ్చటం పై వాహనదారులు , గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.