Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబు కుప్పం కోట బద్ధలవుతోంది.. అందుకే ఓటమికి సాకులు: సజ్జల రామకృష్ణారెడ్డి

బాబు కుప్పం కోట బద్ధలవుతోంది.. అందుకే ఓటమికి సాకులు: సజ్జల రామకృష్ణారెడ్డి
, సోమవారం, 15 నవంబరు 2021 (22:37 IST)
దశాబ్దాలుగా నిర్మించుకున్న తన సొంత నియోజకవర్గం కుప్పం కోట బద్ధలవుతుండటంతో, చంద్రబాబులో అసహనం పెరిగిపోయి దొంగ ఓట్లు, ప్రజాస్వామ్య పరిరక్షణ.. అంటూ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలో రాబోయే ఓటమికి సాకులు వెతుక్కుంటూ, మతిభ్రమించినవాడిలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

కేవలం 37 వేల 600 ఉన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక కోసం చంద్రబాబు తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెరలోనే దశాబ్దాలుగా మగ్గిన కుప్పంలో దొంగ ఓట్లు వేయించడం, వేరే ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడం ఇంతకాలం చంద్రబాబు చేస్తూ వచ్చినవేనని, ఇప్పటికీ కుప్పంలో వేలల్లో దొంగ ఓట్లు ఉన్నాయన్నారు.

ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ, ముక్కు పుడుకలు, ఇతర తాయిలాలు ఇస్తూ మభ్యపెడుతూ అడ్డంగా దొరికిపోయింది టీడీపీ కార్యకర్తలు, నాయకులే అని వీడియో సాక్ష్యాధారాలతో సహా సజ్జల మీడియా ముందు ప్రదర్శించారు.  మేమేగనుక అధికార దుర్వినియోగానికి పాల్పడితే... టీడీపీకి చెందిన వందల మంది కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి డౌన్ డౌన్ అని అరవగలరా, మా చిత్తూరు ఎంపీని బయటకు రానివ్వకుండా నిర్భందించగలరా అని సూటిగా ప్రశ్నించారు. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలన సువాసనలు కుప్పం నియోజకవర్గానికీ తాకాయని, చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినట్టు బాబు కోటను ప్రజలు బద్ధలుకొడుతున్నారన్నారు. బాబు అధికారంలో ఉంటే... ఏం చేసినా అంతా కరెక్టుగా అనిపిస్తుందని, ఆయన అధికారం నుంచి దిగిపోతే.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినట్టు మాట్లాడటం ఆయనకు అలవాటు అన్నారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు కలిసిపోతే అది చారిత్రక అవసరం అని ప్రచారం చేశాడని, ఇప్పుడు కుప్పం కోటలు బద్ధలవుతుంటే.. కుప్పం కోసం కాదు,  ప్రజాస్వామ్య పరిరక్షణకోసం అంటూ డ్రామాలు ఆడుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే.. ఈ జన్మకు ఆయన మారడు, ఇలాంటి వ్యక్తినా ఇన్నేళ్ళూ భరించిందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- సుదీర్ఘ కాలంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తం 37,600 మంది ఓటర్లు ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో ఎలా మాట్లాడారో... రాజ్యాంగం, రాజ్యాంగస్పూర్తి, ప్రజాస్వామ్యం, ప్రజల బాధ్యత, మీడియా బాధ్యత... ఎవరెవరు ఎలా తిరగబడాలి అనేలా చంద్రబాబు అనర్ఘళంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చూశాం.

చంద్రబాబు యుద్ధ రంగంలోకి దూకాలన్నట్లుగా కుప్పం బయల్దేరాలనుకుని వాయిదా వేసుకున్నానని చెప్పిన తీరునూ చూశాం. అసలు చంద్రబాబుకు ఏమైంది... అసలు ఇలాంటి వ్యక్తినా, ఈ రాష్ట్రం 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా భరించింది అనే బాధ, భరించినందుకు ఇలాంటి దౌర్భాగ్యపు స్థితిని తెచ్చుకున్నామనే భావన కలుగుతుంది.
 
2- ఇవాళ 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అసలైన గీటురాయి. ఆ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా, చెదురు, మదురుగా జరిగే సంఘటనలను దాటుకుని ఒక కూటమో, పార్టీనో గెలుపొందుతుంది.

అయితే ఇప్పుడు జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది కాబట్టి, ఒకరకంగా ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ ఎన్నికలు ఫలితాలు తెలుపుతాయి కాబట్టి, మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాం. మా ప్రభుత్వంలోని లోపాలను వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేయడం సహజంగానే జరిగేవి.

ప్రతిపక్షాలు తాము పోటీలో లేమంటూనే అన్ని పార్టీలు కలిసి ఓ ముసుగులో దూరి పోరాడినా, లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒకే తాను ముక్కలు లాంటావి. ఈ పార్టీలన్ని కలిసి ఒకే అభ్యర్థికి మద్దతు తెలిపినా... గత ఎన్నికలతో పోల్చితే  వైయస్సార్‌ సీపీకి దాదాపు 65-70శాతం పైగా ఓట్లు వచ్చినవి కనిపిస్తూనే ఉన్నాయి.
 
3- ఇప్పుడు జరుగుతున్న అత్యంత కీలకమైన కుప్పం మున్సిపల్‌ ఎన్నికలను గమనిస్తే... గత ఎన్నికల్లో  మిగతా నియోజకవర్గాలను మినహాయిస్తే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి( 30వేల ఓట్లు) మెజార్టీతో విజయం సాధించారు. కుప్పంలో గుర్తు మీద జరిగిన  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వైయస్సార్‌ సీపీ స్వీప్‌ చేసింది. ఇక మిగిలింది కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు. కుప్పం దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు చెరలో మగ్గింది.

కుప్పం నియోజకవర్గంలో సుమారు 8వేల దొంగ ఓట్లు ఉన్నాయని బయటపడింది. బయట నుంచి వ్యక్తులను రప్పించి దొంగ ఓట్లు వేయించే లేదా రిగ్గింగ్‌ చేయించే అలవాటుగానీ చంద్రబాబుకు మాత్రమే ఉంది. కుప్పంలో ఇన్నాళ్లూ మకుటం లేని మహారాజులా చంద్రబాబు వెలిగారు. అయితే తొలిసారి ఆ కోట బద్ధలైంది.

ఎందుకు బద్ధలైందంటే అందరికీ తెలిసిందే. చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినట్లు.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక అమలవుతోన్న సంక్షేమ ఫలాలు, సంక్షేమం ద్వారా అభివృద్ధి రుచిని ప్రజలు చూడటం మొదలుపెట్టాక సహజంగానే సువాసనలు కుప్పానికీ వెళ్లాయి. వాటి ప్రతిస్పందనగా ప్రజలు కూడా స్పందించారు. దాని ఫలితమే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైయస్సార్‌ సీపీకి జనాలు పట్టం కట్టడమే నిదర్శనం. అదే ఇక్కడ కూడా ప్రతిఫలించే అవకాశం ఉంది. 

-  కుప్పం టౌన్‌లో గెలుపు రాగానే అదో విజయంగా భావించాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అంతా మనం మంచి పాలన ఇస్తే ప్రజలంతా మనతోనే ఉంటారు. వారి ఆశీస్సులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. మనం సరిగా పాలించకుంటే ప్రజలు రిజెక్ట్‌ చేస్తారు. దాన్ని కూడా హంబుల్‌గానే రిసీవ్‌ చేసుకోవాలనే తత్వం ఉన్న పార్టీ నాయకుడు అధ్యక్షత ఉన్న మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు.
 
4- వైయస్సార్‌ సీపీ ఎన్నడూ దిగజారుడు విధానాలకు పోలేదు, పోదు. గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ మేము అలా చేయలేదు. ఇప్పుడూ అలాంటి విధానాలకు పాల్పడం. అంతేకాకుండా ఎన్నికలు సవ్యంగా జరిగేలా ఒక చట్టం కూడా తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసినా, డబ్బులు పంచినా వారిని అనర్హులను చేసే చట్టం తీసుకువచ్చారు. బహుశా అంత సాహసం చేసిన నాయకుడు  జగన్‌గారే అని చెప్పవచ్చు.

- ఇక చంద్రబాబు నాయుడు చరిత్ర చూస్తే.. ఓటర్లను తిరగబడండి అంటారు. ఎన్నిక కాదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటాడు. ఇదంతా చూస్తుంటే 2019 ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఎన్నికల్లో గెలిపించాలంటూ.. చారిత్రక అవసరం అని మాట్లాడటం గుర్తుకు వస్తోంది. ఆయనకు సమయం, సందర్భం ఉండాల్సిన అవసరం లేదు.. ఇలాంటి పదాలను ఆయన ఎక్కడ నుంచి పట్టుకువస్తాడో అర్థం కావడం లేదు. కేవలం 37వేల ఓట్లు ఉన్న 25 వార్డుల కుప్పం నగర పంచాయతీ ... దానికి సంబంధించి ఎన్నిక. వార్డుకు వెయ్యి నుంచి 1500 మంది ఉంటారు.

ప్రతి వార్డుకు రెండు పోలింగ్‌ కేంద్రాలు. ప్రతి బూత్‌లో ఓ ఏజెంట్‌ కూర్చుంటాడు. మీ ఏజెంట్‌, మీ అభ్యర్థి, మా ఏజెంట్‌, మా అభ్యర్థి కూడా అక్కడే ఉంటారు.

- 48 పోలింగ్‌ కేంద్రాలకుగానూ 38 సమస్మాత్మక కేంద్రాలను ఎన్నికల సంఘం గుర్తించింది. దొంగ ఓట్లు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్న చంద్రబాబుకు అక్కడ బూత్‌లో వాళ్ల ఏజెంట్‌ ఉంటాడు కదా? ఎవరు బయటవాళ్లో, ఎవరు స్థానికులో,  మీ ముఠా గ్యాంగ్‌కు తెలుసు కదా? ఇంకా ఎక్కడ దొంగ ఓట్లకు ఆస్కారం ఉంది?

-మధ్యాహ్నం ఒంటిగంటకు 60శాతం ఓటింగ్‌ పోలైంది. ఏదైనా చేయాలంటే అంత పర్సంటేజ్‌ రాదు కదా? ఓటర్లు భారీగా వచ్చి ఓట్లు వేస్తున్నారు కదా?
 
5- పోలింగ్‌ కేంద్రాల బయట మీ పార్టీవాళ్లు గుంపులు గుంపులుగా ఎందుకు తిరుగుతున్నారు? ఎవరైనా దొంగ ఓట్లు వేయాలంటే.. ఉన్న ఓటును వేయకపోతే, ఆ ఓటును వేరే ఒకరు వేయడం. దీన్నే దొంగ ఓట్లు అంటారు. చంద్రబాబు తన అడ్డాగా చెప్పుకునే కుప్పంలో అక్కడ మీ ఓటర్లు, మీ మీద అభిమానం ఉన్నప్పుడు ఓటర్లు ఓటు వేయడానికి రాకుండా అన్నా ఉండాలి. లేకపోతే అసలు ఓటరే లేకుండా పేరు చేర్చి అయినా ఉండాలి. ఇవికాకుండా ఇక దొంగ ఓటు ఎలా వస్తుంది చంద్రబాబూ?

- ఏతావాతా కుప్పంలో ఏం జరిగినా అదంతా మీ ఖాతాలోనే పడుతుంది బాబు. ఇక ఆయన మాట్లాడినవన్నీ తన గురించి మాట్లాడుకున్నవే అంటూ అందుకు సంబంధించిన వీడియోలను మీడియా ముందు ఉంచారు.

-  ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీడీపీ నేతలు, చేసింది ఎవరు మీరు కాదా?, స్థానికేతరులను కుప్పంకు తీసుకు వచ్చిన టీడీపీ నేతలు, కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడిన కార్యకర్తలకు సంబంధించిన వీడియోలు చూశాం. అసలు కుప్పంకు బయట ప్రాంతాల నుంచి అంతంతమంది కార్యకర్తలను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 37వేల మంది ఓటర్లలో మీ ఓటర్ల మెజార్టీ ఉంటే వాళ్లంతా పోలింగ్ బూత్‌ల లోకి వెళ్లి ఓటు వేసి రావచ్చు కదా. ఎవర్ని ఆపడానికి ఈ ప్రయత్నం? రోడ్ల మీద ఎక్కడ చూసినా టీడీపీవాళ్లే గుంపులుగా కనిపిస్తున్నారు.  మీ పచ్చ చానల్స్‌లో కూడా టెలీకాస్ట్‌ అవుతున్నవి కూడా ఇవే. 

- చంద్రబాబు బయట నుంచి తోలిన జనాల కేకలు, అరుపులు. అక్కడికీ మీరు రెచ్చగొట్టడానికి ఓటర్లను బయట ఆపితే, దానిపై నాటకం మొదలుపెట్టి నానా యాగీ క్రియేట్‌ చేస్తున్నారు. 
- చంద్రబాబు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ చూస్తే... ఆయన ఈ జన్మకు మారరు అనేది స్పష్టం అవుతుంది. చంద్రబాబు మాట్లాడినవన్నీ ... ఆయనకే వర్తిస్తాయి. 

- తమ ఏజెంట్లను అరెస్ట్‌ చేశారని చంద్రబాబు అంటున్నారు? అసలు ఏజెంట్లుగా రౌడీషీటర్లను ఎందుకు పెట్టారు? చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. లేనిది ఉన్నట్లు భ్రమింపచేయడం. 

- ఘోరంగా ఓటమి పాలవుతున్నారు కాబట్టి.. ఇప్పుడు కుప్పంలో ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రపంచాన్ని నమ్మించడానికి చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.
 
6- ఇన్నాళ్లూ చంద్రబాబు చెరలో ఉన్న కుప్పం ప్రజలు... ఇప్పుడు జగనన్నకు అండగా ఉంటామనే వాయిస్‌ ను బలంగా వినిపిస్తున్నారు. అందుకే గెలుపుపై మాకు నమ్మకం ఉంది. ఎవరు  అవునన్నా, కాదన్నా... మొదటి నుంచి ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు సాకులు వెతకటం అలవాటు. చంద్రబాబు కట్టకున్న కోటను వైయస్సార్‌ సీపీ బద్ధలు కొడుతోంది. 
 
7- నిజంగా అధికార దుర్వినియోగమే జరిగితే,  మేము అలాంటి ప్రయత్నాలు చేస్తే... మీ పార్టీ శ్రేణులు అంత పెద్ద ఎత్తున కుప్పంలో కనిపించరు కదా? చేయాల్సినవన్నీ మీరు చేస్తూ మాపై సాకులు వేయడమా? కరోనా మహమ్మారి విజృంభణ చేసిన సమయంలోనూ ముఖ్యమంత్రిగారు ఇచ్చిన మాట తప్పకుండ, కష్టాన్ని పంటిబిగువున లాగుతూ, ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇలా చేస్తున్నందునే ముఖ్యమంత్రిగారిని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, గుండెల్లో పెట్టుకుంటున్నారు. 
 
8- మీకు చేతనైతే, మీరు కూడా మారిన మనిషిని అంటూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవాలి కానీ, మీ హయాంలో చేసినవన్నీ మూటకట్టి మామీదకు వదలాలని చూడటం సరికాదు. చంద్రబాబు ఇంకా ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కుప్పం ప్రజలు ఇంతకాలం చంద్రబాబు ఏదో ఒరగపెడతారని అపార్థం చేసుకున్నారు.

అప్పుడు రాజశేఖర్‌రెడ్డిగారిని, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని చూశాక ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి గడప దగ్గరకు వస్తున్నాయని అర్థం చేసుకున్నారు. ప్రజలకు అర్థం అయింది కానీ, ప్రజల నుంచి రాలేదు కాబట్టే చంద్రబాబుకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
 
9- వెన్నుపోటు ద్వారా దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నాడు. అన్నిపోయీ కుప్పం అన్నా మిగులుతుందనుకున్న చంద్రబాబుకు అది కూడా మిగలడం లేదు. ఆయనకు స్థానం లేదు. భవిష్యత్‌లో ప్రజాస్వామ్యంలో పనికిరాని క్యారెక్టర్‌ ఒకటి ఉంది అని చూపించడానికే చంద్రబాబు నాయుడు పాత్ర పనికివస్తుంది.

- కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబట్టే.. చంద్రబాబు తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. తిరగబడిండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు మీదే ప్రజలు తిరగబడుతున్నారు. కుప్పంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చిన్న టౌన్‌లో మధ్యాహ్నం 1గంటకు 60శాతం పోలింగ్‌ నమోదు అయిందంటే జనం ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుస్తోంది. గెలుస్తామన్న ధీమా ఉంటే చంద్రబాబుకు ఈ ఏడుపు ఎందుకు?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరువునష్టం అంటే?