Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీరు, చెట్టు పెండింగ్ బిల్లులు రూ.1,270 కోట్లు...ఎలా సార్?

నీరు, చెట్టు పెండింగ్ బిల్లులు రూ.1,270 కోట్లు...ఎలా సార్?
విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (10:25 IST)
నీరు, చెట్టు పెండింగ్ బిల్లులు రూ.1,270 కోట్లున్నాయ్... ఇలా అయితే ఎలా సార్... వెంటనే వాటిని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై మీరే ఒత్తిడి తేవాలంటూ... ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకి రైతులు విజ్ణ్న‌ప్తి చేశారు. సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు ఆధ్వ‌ర్యంలో మెమొరాండం స‌మ‌ర్పించారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని కలిసి పూర్తి వివరాలతో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భం గా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు మాట్లాడుతూ, 2017 -2019 వరకు అప్పటి ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమాన్ని జీవో 187 ప్రకారం చేసింద‌న్నారు.

నీటి సంఘాల ప్రతినిధులైన సన్న చిన్నకారు రైతులు 13 జిల్లాలలో చెరువుల పూడిక తీత, చెక్ డ్యామ్ ల నిర్మాణం, గొలుసు కట్టు చెరువులు, ఇతర నీటి సంరక్షణ చర్యలు చేశామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 98 కోట్ల ఘనపు మీటర్ల పూడిక మట్టిని తీయటం వల్ల 90 టీఎంసీలు భూగర్భ జలాలుగా మారి, 6.795 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడిందని వివ‌రించారు. దీనివల్ల అప్పటి ప్రభుత్వానికి 9 మెరిట్ స్కాచ్ అవార్డులు వచ్చాయని వివరించారు.

ఈ పరిస్తుతులలో 2019 లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, పనులు పూర్తి అయి సి ఎఫ్ ఎం ఎస్ సిస్టం లో టోకెన్ పడిన బిల్లులను కూడా చెల్లించకుండా విజిలెన్సు విచారణ పేరుతో రైతులను వేధిస్తోంద‌ని ఆరోపించారు. దీని మీద ఆగస్టు 2020 లో పెండింగ్ బిల్లులు చెల్లించమని హైకోర్టు ను కొంతమంది రైతులు ఆశ్రయించగా, సంవత్సర కాలం గా హైకోర్టు లో కూడా మెమోలు, విచారణ చేస్తున్నామని కాలయాపన చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, నీరు చెట్టుపై గత రెండున్నర సంవ‌త్స‌రాలు రైతులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవటం దుర్మార్గమని , దీనిపై రైతులకు తెలుగుదేశం పార్టీ తరపున పూర్తి మద్దతు ఇచ్చి ప్రభుత్వంపై పోరాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య కార్యవర్గ సభ్యులు చెన్నుపాటి శ్రీధర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్నిపై తీర్పు రిజర్వు