Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్

Advertiesment
ఏపీలో బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్
, ఆదివారం, 26 జులై 2020 (09:18 IST)
ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్ కమ్ సర్టిఫికెట్) కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ కార్డు వారి ఆదాయానికి కొలమానంగా పేర్కొంటూ మరో నిర్ణయం కూడా తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆ రెండు ఫైళ్లపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంతకం చేశారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించారు.

ఈ  సందర్భంగా బియ్యం కార్డుదారులకు ఇన్ కమ్ సర్టిఫికెట్ మినహాయింపుతో పాటు ఏడాది నుంచి నాలుగేళ్లకు ఇన్ కమ్ సర్టిఫికెట్ కాల పరిమితి గడువు పెంపుపై ఆయన తన తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కీలకమైన రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ అప్పగించారన్నారు.

తనపై ఆయన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం ఆశయ సాధన మేరకు త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ, రెవెన్యూ శాఖలో ఉన్న సమర్థవంతమైన అధికారుల సాయంతో పారదర్శకమైన సేవలు అందిస్తానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా, అన్ని వర్గాలకూ సమతుల్యత పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సహా అయిదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశమిచ్చాన్నారు.

తన ఏడాది పాలనలోనే దేశంలో అత్యుత్తుతమైన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్ నాలుగో స్థానంలో నిలిచారని కొనియాడారు. దిశ చట్టం, ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజల మనస్సుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక స్థానం పొందారన్నారు. భూ వివాదాల పరిష్కారానికి త్వరలో భూ సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.

బియ్యం కార్డే ఇన్ కమ్ సర్టిఫికెట్ గా గుర్తించడం వల్ల పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇన్ కమ్ సర్టిఫికెట్ ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస తప్పుతుందన్నారు. పేదలందరికీ సొంతిళ్లు ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, దీనిలో భాగంగా ఆగస్టు 15వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారని తెలిపారు.

గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే పాలన తీసుకొచ్చామన్నారు. ప్రజల ఆశీస్సులు మెండుగా పొందుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు పాలన సాగించడం ఖామయని ధీమా వ్యక్తం చేశారు.

దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారాలు...
రెవెన్యూ శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపాలని ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని తన ఛాంబర్ లో నిర్వహించారు.

భూ తగదాల పరిష్కారినికి ప్రభుత్వం త్వరలో భూ రీ సర్వే చేపట్టనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి.. .డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మాన్యూవల్ లో ఉన్న భూ రికార్డులను కంప్యూటరీకరణ చేస్తున్నామని సీసీఎల్ఎ జాయింట్ సెక్రటరీ సీఎచ్. శ్రీధర్ తెలిపారు.

రెవెన్యూ శాఖలో సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.  రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖలో చేపడుతున్న పలు కార్యక్రమాలను డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప జిల్లాలో 5 కరోనా కేర్ సెంటర్లు ఏర్పాటు: మంత్రి ఆదిమూలపు సురేష్