రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవమని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.
ప్రస్తుతం మరే ఇతర రాష్ట్రాల్లోని లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలువుతున్నాయని, ఇపుడు రేషన్ కార్డులు ఎందుకు ఏరివేస్తారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 1.48 కోట్ల రేషన్ కార్డుల్లో 4 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులున్నారని, వీరిలో 85 శాతం మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35 లక్షల మందికిపైగా నమోదు చేయించుకోవాల్సి ఉందని అందుకే నమోదు చేపట్టారని చెప్పారు. విజయవాడ నగరంలో రేషన్ కార్డుదారులు 1,46,324 మంది ఉంటే, వారిలో 31,900 మంది ఈ-కేవైసీ వివరాలు నమోదయ్యాయని చెప్పారు. ఇంకా 1,14,424 మంది నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు.
ఈ నేపధ్యంలో ప్రజలు ఈ-కేవైసీ కోసం మీ-సేవ, ఆధార్ కేంద్రాల వద్ద భారీగా చేరడంతో, కొందరు వారి దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని మేయర్ చెప్పారు. ఈ విషయంపై ఫోన్‌లో సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్‌తో మేయర్ మట్లాడారు. దీంతో స్పందించిన సబ్ కలెక్టర్ మట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ - కె వై సి నమోదు చేస్తున్నాం అని చెప్పారు.
ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ - కె వై సి చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు నగరంలో ఈ - కె వై సి కేంద్రాలు 71 ఉన్నాయని, మరో రెండు సెంటర్లు అదనంగా చేర్చడం జరిగిందని, తర్వలో మరో 10 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్‌కు ఫోన్‌లో వివరించారు. ప్రజలు కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకోవాలని మేయర్ సూచించారు.