రాజ్యాంగ వ్యవస్థలతో, మరీ ముఖ్యంగా న్యాయస్థానాలతో పెట్టుకుంటే నెగ్గలేమని ఏపీలోని జగన్ ప్రభుత్వం గ్రహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం వ్యవహారంలో ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం.. ఎట్టకేలకు వెనుకడుగు వేసింది. ఎన్నికల కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే నియమిస్తూ అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు వెలువరించింది.
కరోనా కమ్ముకొస్తున్న నేపథ్యంలో రమేశ్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేసినప్పటి నుంచే ఆయనను తొలగించడంపై దృష్టి సారించింది. ‘సంస్కరణల’ పేరిట ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘మీ పదవీకాలం పూర్తయింది’ అంటూ రమేశ్‌కుమార్‌కు ప్రభుత్వం ఉద్వాసన పలికింది.
ఆయన స్థానంలో రాత్రికి రాత్రే తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను అర్ధంతరంగా తొలగించడం కుదరదని రమేశ్ కుమార్ న్యాయపోరాటం ప్రారంభించారు. అలాగే జడ్జిలను దూషించడానికి సంబంధించిన ఆధారాలను నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సుప్రీంకోర్టుకు అందించేందుకు సిద్ధమయ్యారు.
హైకోర్టులో, సుప్రీంకోర్టులో వ్యతిరేక నిర్ణయాలు వచ్చినా... రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించేందుకు ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు. దీంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పైగా... హైకోర్టు తీర్పు అమలు కోసం గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్ హైకోర్టులో త్వరలో విచారణకు రానుంది. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూస్తే... అన్ని దారులూ మూసుకుపోయినట్లేనని, కోర్టు తీర్పు అమలు చేయకపోతే తలబొప్పి కట్టడం ఖాయమని సర్కారు భావించింది.
రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా పునరుద్ధరిస్తూ గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ కాగా, దానిపై పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేశారు.